మీడియా ముందు బాధ్యతారహిత ప్రకటనలు చేయవద్దని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. ఆదివారం నమో యాప్ ద్వారా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మోదీ, మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. 'మీ అంతట మీరే మీడియాకు మసాలా కావొద్దు. అనవసర విషయాల జోలికి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు' అని తేల్చిచెప్పారు. 'మనం చేసే పొరపాట్లు మీడియాకు మసాలా అందిస్తాయి. మనవాళ్లు కెమెరా కనిపించగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. వాటిని మీడియా వాడుకుంటుంది. ఇది మీడియా తప్పిదం కాదు' అని అన్నారు. దీనివల్ల పార్టీతోపాటు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని గుర్తుంచుకోవాలని సూచించారు. బాధ్యతారాహిత్య వాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 14 నుంచి మే 5 వరకు సాగుతున్న 'గ్రామ్ స్వరాజ్ అభియాన్' ప్రచారానికి సంబంధించి కూడా పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధుల లక్ష్యం కావాలని ఆదేశించారు. ప్రజలతో మమేకం కావడానికి సోషల్ మీడియాను విరివిగా వాడాలని బీజేపీ నేతలను కోరారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే బీజేపీ అధికారంలోకి రాలేదని ఉద్ఘాటించిన మోదీ మొదటి నుంచి తమ పార్టీ ప్రజలతో మమేకమైందని తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రధాన కర్తవ్యం ప్రజా సమస్యలను తీర్చడమేనని, అన్ని వర్గాలు, ప్రాంతాలు తమకు సమానమేనని అన్నారు.