కేంద్ర ఎన్నికల కమిషన్‌ నేడు కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నది. నేటి ఉదయం 11 గంటలకు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే 'ఎన్నికల కోడ్' వెంటనే అమల్లోకి రానుంది. 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ గడువు మే28న ముగుస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏప్రిల్ చివరినాటికి లేదా మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. కర్నాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.  సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళుతుండగా..యడ్యురప్ప నేతృత్వంలో కాషాయ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కర్నాటకయే అతిపెద్దది.


కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని కొన్ని సర్వేలో వెల్లడైంది. 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 126 సీట్లు గెలుచుకుంటుందని సీ-ఫొన్ నిర్వహించిన తాజా ఎన్నికల సర్వే అంచనా వేసింది. బీజేపీ 2013లో కంటే మెరుగుపడి 70  స్థానాలలో విజయం సాధిస్తుందని, జేడీ(ఎస్) 40 నుంచి 27 స్థానాలకు దిగజారుతుందని తెలిపింది.