సెప్టెంబర్ 11న తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం
తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం
తెలంగాణలో శాసనసభ రద్దుకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం ఈ నెల 11న తెలంగాణలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి తగిన వాతావరణం, పరిస్థితులపై ఎన్నికల సంఘం బృందం పరిశీలించనున్నట్టు సమాచారం.
భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలోని బృందం సెప్టెంబర్ 11న హైదరాబాద్‌కి రానుంది. హైదరాబాద్ పర్యటన అనంతరం ఈ బృందం పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి, సమగ్రమైన నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనుంది. ఇదిలావుంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మిజోరం వంటి రాష్ట్రాలతోపాటే తెలంగాణలో ఎన్నికల జరిగే అవకాశం లేకపోవచ్చునని జరుగుతున్న ప్రచారాన్ని భారత ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత వరకు మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘం అధ్యయనం చేసి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటుంది కానీ ఎవరో చెప్పే జ్యోతిష్యం తేదీల ఆధారంగా కాదు అని ఓపీ రావత్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.