న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పేరుపై ఇద్దరు లేక ముగ్గురు అభ్యర్థులు వున్నట్టయితే, అటువంటి సందర్భంలో తాము ఎవరికి ఓటు వేస్తున్నామో ఎలా గుర్తించాలి అనే సందేహం ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లను తికమక పెట్టే అవకాశాలున్నాయి. అయితే సరిగ్గా అటువంటి సందర్భంలోనే అభ్యర్థుల పేర్లు ఓటర్లను తికమకకు గురిచేయకుండా వుండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల నిర్వహణలో ఓ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈవీఎంలలో, బ్యాలెట్ పేపర్లలో కేవలం అభ్యర్థి పేరు, వారి ఎన్నికల గుర్తు వివరాలను మాత్రమే ప్రదర్శించిన ఎన్నికల సంఘం ఇకపై అభ్యర్థుల ఫోటోలను సైతం ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు స్పష్టంచేసింది. 


నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా సీఈసి సునిల్ అరోరా మాట్లాడుతూ.. ఈవిఎంలలోనే కాకుండా పోస్టల్ బ్యాలెట్ పత్రాలపై సైతం అభ్యర్థుల ఫోటోలను ముద్రించనున్నట్టు తేల్చిచెప్పింది. ఇందుకోసం ఎన్నికల్లో పోటీచేస్తోన్న అభ్యర్థులు చేయాల్సిందల్లా ఒక్కటే... ఎన్నికల సంఘం సూచించిన నియమనిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలతోపాటే తమ నూతన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడమే.