భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నలుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి కోవింద్ ఇవాళ పెద్దల సభకు నామినేట్ చేశారు. పెద్దల సభకు నామినేట్ అయిన వారి పేర్లు: యూపీ మాజీ బీజేపీ ఎంపీ, దళిత, రైతు నాయకుడు రామ్ షకల్, ఆరెస్సెస్ ప్రముఖుడు, రచయిత, కాలమిస్టు రాకేశ్ సిన్హా, శాస్త్రీయ నృత్యకారిణి సోనాల్ మాన్‌సింగ్, శిల్ప కళాకారుడు రఘునాథ్. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక, సేవా రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఇది రాష్ట్రపతి శాసనాధికారాల్లో ఒకటి. ప్రస్తుతం రాజ్యసభలో ఎనిమిది మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ షకల్
రామ్ షకల్.. ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్‌గంజ్‌ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. రైతు నాయకుడిగా ముద్రపడ్డ షకల్ రైతుల, కూలీల, వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్నారు.


రాకేశ్ సిన్హా


ఆరెస్సెస్‌ భావజాలం కలిగిన రాకేశ్ సిన్హా ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ థింక్-ట్యాంక్ ఇండియా పాలసీ ఫౌండేషన్‌‌ను స్థాపించారు. ప్రస్తుతం సదరు సంస్థకు గౌరవ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాలమిస్ట్‌గా, రచయితగా సిన్హా తన ప్రత్యేకతను చాటుకున్నారు.


రఘునాథ్‌ మహాపాత్ర


రఘునాథ్‌ మహాపాత్ర తన శిల్పకళతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. 1959 నుంచి ఆయన శిల్పిగా కొనసాగుతూ రెండు వేల మందికి శిక్షణ ఇచ్చారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం సుందరీకరణ కోసం ఆయన పనిచేశారు. భారత ప్రభుత్వం పద్మ శ్రీ(1976), పద్మ భూషణ్ (2001), పద్మవిభూషణ్(2013)లతో సత్కరించింది. 


సోనాల్ మాన్‌సింగ్


సోనాల్ మాన్‌సింగ్ గత ఆరు దశాబ్దాలుగా భరత నాట్యం, ఒడిస్సి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.1977లో ఢిల్లీలో సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్సెస్‌ నెలకొల్పారు. భారత ప్రభుత్వం ఆమె సేవలకు గాను 1992లో పద్మభూషణ్‌, 2003లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. మన్‌సింగ్‌‌కు  సంగీత నాటక అకాడమీ అవార్డు-ఒడిస్సి కూడా దక్కింది.


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నామినేట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి/రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వీరిచే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభకు నామినేట్ అయిన ఈ నలుగురు సభ్యులు ఆరేళ్లు పదవిలో ఉంటారు.