న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 43కి చేరింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండి ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో అంటుకున్న మంటలు మొత్తం భవనానికి వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామునే 5 గంటల సమయంలో ప్రమాదం జరగడం.. ఆ సమయంలో భవనంలో ఉన్న వాళ్లలో చాలా మంది గాఢ నిద్రలో ఉండటం వల్లే ప్రమాదం తీవ్రత పెరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆసుపత్రి, బారా హిందూ రావ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తొలుత 12 మంది మృతి చెందినట్టు తెలిసినప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొంత మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య మొదట 35కి చేరింది. ఆ తర్వాత మరో 8 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 43కి పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలోనూ ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఈ దుర్ఘటనపై ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుసేన్ విచారం వ్యక్తంచేశారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఇమ్రాన్ హుసేన్ తెలిపారు.


 



 


ఘటనా స్థలంలో 30 అగ్నిమాపక యంత్రాల సహాయంతో అగ్నిమాపక బృందాలు సహాయ చర్యలు అందిస్తున్నాయి. భవనంలో అక్రమంగా నిర్వహిస్తోన్న ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అంటుకున్న మంటలు వెంటనే పక్కనే ఉన్న రెండు నివాసాలకు వ్యాపించాయని.. అక్కడి నుంచి మిగతా భవనం మొత్తానికి నిప్పంటుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వచ్చాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ చీప్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి తెలిపారు.