ప్రముఖ బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా ఈ రోజు కన్నుమూశారు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగానూ, రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయమే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి కోరిక మేరకు.. ఖురానా కళ్లను ఆయన కుటుంబ సభ్యులు ఐబ్యాంకుకి దానం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. 15 అక్టోబరు 1936 తేదిన పాకిస్తాన్ పంజాబ్‌లోని లయల్ పూర్ ప్రాంతంలో జన్మించిన మదన్ లాల్ కుటుంబం దేశ విభజన తర్వాత ఢిల్లీకి మకాం మార్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలహాబాద్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన ఖురానా.. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ వాలంటీరుగా పనిచేశారు. 1960లో అఖిల భారతీయ విద్యా పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందు ఖురానా కొన్నాళ్లు ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. ఇందిరా గాంధీ మరణం తర్వాత నిర్వహించిన 1984 సాధారణ ఎన్నికల్లో బీజేపీ భారీగా పతనమైంది. ఇదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఖురానా.. ఢిల్లీలో బీజేపీ నిలదొక్కుకొనేందుకు అహర్నిశలు శ్రమించారు. 1993 - 1996 సంవత్సరాల వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.


ఒకానొక సందర్భంలో బీజేపీ సీనియర్ నేత, సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ క్రిష్ణ అద్వానీని విమర్శించిన కారణంగా.. ఖురానాను పార్టీ నుంచి తొలిగించడం జరిగింది. కానీ.. తర్వాత మళ్లీ పార్టీనే ఆయనను తీసుకుంది. ఖురానాకి నలుగురు సంతానం. ఆయన తన కుటుంబంతో సహా ఢిల్లీలోని కీర్తినగర్ ప్రాంతంలో నివసించేవారు. ఖురానా అకాల మరణంపై బీజేపీ నేతలు అందరూ తమ సంతాపాన్ని ప్రకటించారు. ఓ గొప్ప నాయకుడిని తమ పార్టీ కోల్పోయిందని.. ఖురానా పార్టీకి అందించిన సేవలు మరపురానివని తెలిపారు.