లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ నెల 7వ తేదీన కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆదివారం గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ ఆయన  ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా సోమ్‌నాథ్ ఛటర్జీ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.



సోమ్‌నాథ్ ఛటర్జీ 10 సార్లు లోక్‌సభ సభ్యుడిగా సుదీర్ఘ సేవలందించారు. 1971 నుంచి 2009 వరకు (1984 ఎన్నికల్లో మినహా) లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ 2008 వరకు సభ్యుడిగా ఉన్నారు. 2004-2009 వరకు ఐదేళ్లపాటు లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారు. 2008లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం నుంచి సీపీఎం వైదొలగిన తరువాత.. సోమ్‌నాథ్‌ తన స్పీకర్‌ పదవికి రాజీనామా చేయలేదు. దీంతో సీపీఎం ఆయనను పార్టీ నుండి బహిష్కరించింది. అప్పటినుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.