నాగాలాండ్ పోల్స్: ఎన్నికల ముందే అభ్యర్థి గెలుపు
నాగాలాండ్ లో ఎన్నికలకు ముందే ఎన్డీపీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి నెయిఫియూ రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) నేత నెయిఫియూ రియో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి నాగ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అభ్యర్ధి చుప్ఫూ అంగమి సోమవారం నామినేషన్ ను ఉపసంహరించుకున్న తరువాత రియో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. రియో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి. ఈయన కొహిమా జిల్లాలో ఉత్తర అగామి II నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
ఉత్తర అగామి II నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఒకేఒక ఎన్పీఎఫ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకొని పోటీ నుంచి వైదొలిగిన తర్వాత ఎన్డీపీపీ అభ్యర్థి రియో విజేతగా నిలిచారు.
రియో గత నెలలో నాగ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) పార్టీ నుండి బయటకు వచ్చి కొత్తగా ఏర్పడిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)లో చేరారు. ప్రస్తుతం రియో ఎన్డీపీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, కొహిమా జిల్లాలో ఉత్తర అగామి II నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.
రియోకు ఇలా జరగటం ఇదేం మొదటిసారి కాదు. 1998లో కూడా ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రియో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
నాగాలాండ్ ముఖ్య ఎన్నికల అధికారి అభిజిత్ సిన్హా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఫిబ్రవరి 27న జరగనున్న ఎన్నికలకు ఐదుగురు మహిళలతో సహా మొత్తం 195 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.