రక్షణ దళాల పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్‌తో పాటు సయిఫుద్దీన్ సోజ్ పై కేసులు నమోదు చేశారు న్యాయవాది శశిభూషణ్. పటియాలా హౌస్ కోర్టులో ఈ కేసును న్యాయవాది ఫైల్ చేశారు. ఇటీవలే సోజ్ ఇండియన్ ఆర్మీపై వ్యాఖ్యానిస్తూ.. సైనిక దళాలు తమకు ప్రభుత్వం ఇస్తున్న శక్తులను దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఆయన తన మాటలను వక్రీకరించారని మీడియాని కూడా తప్పుబట్టారు. కాశ్మీరీలు వారి స్వతంత్రానికి అనుగుణంగా ఉండేందుకు అనుమతించాలని గతంలో మాజీ పాకిస్తాన్ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ తెలిపిన మాటలను ఈ రోజు నిజమని భావించవచ్చని సోజ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ సోజ్ మాటలకు తమకు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటనను విడుదల చేసింది. 


అలాగే మరో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కూడా ఇండియన్ ఆర్మీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాశ్మీర్ ప్రాంతంలో జరిగే ఆర్మీ ఆపరేషన్స్‌ని తప్పు పడుతూ ఆయన తీవ్రవాదులు కంటే సగటు పౌరులే ఎక్కువగా ఈ ఆపరేషన్స్‌‌‌లో మరణిస్తున్నారని పేర్కొన్నారు.


కేంద్రం రంజాన్ సీజ్ ఫైర్ ఆపరేషన్స్ ముగించాకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఈ ఇరువురి కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని తాను భావిస్తున్నానని తెలుపుతూ శశిభూషణ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.