Gold prices: గుడ్ న్యూస్.. రెండు నెలల్లో రూ.2,100 తగ్గిన బంగారం ధరలు
Gold rates: బంగారం ధరల్లో తరచుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నప్పటికీ.. మొత్తంగా పోల్చుకుంటే గత రెండు నెలల వ్యవధిలో బంగారం ధర దాదాపు రూ.2100 మేర తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
న్యూ ఢిల్లీ: బంగారం ధరల్లో(Gold prices) తరచుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నప్పటికీ.. మొత్తంగా పోల్చుకుంటే గత రెండు నెలల వ్యవధిలో బంగారం ధరలు దాదాపు రూ.2100 మేర తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.40వేల మార్క్ తాకిన 10 గ్రాముల బంగారం ధర తాజాగా రూ.37,860 కనిష్ట స్థాయికి క్షీణించింది. అంతకంటే ముందుగా దిగుమతి సుంకాల పెంచడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడటం వంటి పరిణామాలు బంగారం ధర బాగా పెరడానికి కారణమయ్యాయి. అయితే ఇప్పటి దాకా మూడుసార్లు కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన అమెరికా ఫెడరల్ రిజర్వు.. ఇకపై వడ్డీ రేట్ల కోత ఉండదని స్పష్టంచేయడంతో ఇన్వెస్టర్ల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇదేకాకుండా ధరల పెంపు సైతం బంగారం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని నిపుణులు విశ్లేషించారు.
ఇదిలావుంటే, అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ సైతం బంగారం ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపిస్తోంది. ఇదేకాకుండా వడ్డీ రేట్లను తగ్గిస్తూ చైనా సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం సైతం బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చంటున్నాయి మార్కెట్ వర్గాలు. గత నాలుగేళ్లలో చైనా సెంట్రల్ బ్యాంక్ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.