రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురువారం అయోధ్య రామమందిరంపై తన వైఖరిని స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి చట్టం అవసరమన్నారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రామ జన్మభూమికి స్థలం కేటాయించాల్సి ఉంది. ఆ స్థలంలో ఆలయం ఉందని రుజువులున్నాయి. రాజకీయ జోక్యం లేకపోతే ఈ ఆలయం చాలా కాలం క్రితమే నిర్మించబడి ఉండేది. ప్రభుత్వం రామ మందిరం నిర్మాణానికి ఓ చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నాం.' అని భగవత్ చెప్పారు.


మహారాష్ట్రలోని నాగపూర్‌లో వార్షిక "విజయ దశమి" కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. తీర్పు ఆలస్యం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏ కారణం లేకుండా ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఆవశ్యకమని.. మందిరం నిర్మాణంతో దేశంలో సహృద్భావణ విస్తరిస్తుందన్నారు.


దేశాన్ని ముక్కలు చేయాలన్న భావజాలం కలిగిన వ్యక్తులను కట్టడి చేయాలన్న ఆయన.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల సేవలను గుర్తించుకోవాలన్నారు.



 


అటు  శబరిమలలో మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోలేదని భగవత్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ సంప్రదాయం కొనసాగుతోందని, ఆ ఆచారాన్ని అక్కడ పాటిస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వారు ఆలయంలోకి వెళ్లే వారు కాదన్నారు. దేశంలో అర్బన్ మావోయిజం అంతకంతకు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో కోత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ సరిహద్దులపై దాడిని ఆపలేదన్నారు. దేశ భద్రత గురించి అప్రమత్తంగా ఉండాలన్న ఆయన.. ప్రత్యర్థులకు బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే బదులివ్వాలన్నారు.