జీఎస్టీ ఎఫెక్ట్ : దిగొచ్చిన వాషింగ్ మెషిన్స్, ఫ్రిజ్‌ల ధరలు
7–8 శాతం వరకు తగ్గనున్న గృహోపకరణాల ధరలు
ఇటీవల సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లపై సమీక్ష నిర్వహించిన అనంతరం పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్టు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా వాషింగ్ మెషిన్స్, ఫ్రిజ్‌ల ధరలు కొంతమేరకు దిగొచ్చాయి. 15 రకాల గృహోపకరణాలపై జీఎస్‌టీ కౌన్సిల్ పన్ను రేట్లను తగ్గించడంతో ఈ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని భావించిన ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే వాషింగ్ మెషిన్, ఫ్రిజ్‌ల ధరలను 7–8 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 27 అంగుళాల లోపు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, గ్రైండర్లు, హ్యాండ్ డ్రైయర్స్ వంటి గృహోపకరణాలు జీఎస్‌టీ పన్ను తగ్గినవాటి జాబితాలో ఉన్నాయి.
జీఎస్టీ కౌన్సిల్ సవరించిన జీఎస్‌టీ పన్ను స్లాబ్స్ జూలై 27 నుంచి అంటే నేటి నుంచే అమలులోకి రానుండటంతో ఇప్పటికే ఆయా ఉత్పత్తులపై ధరలను తగ్గించినట్టు పలు వాణిజ్య సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గోద్రెజ్ బ్రాండ్ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై త్వరలోనే 7–8% తగ్గింపు ఉంటుందని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది మీడియాకు తెలిపారు. ఎల్‌జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయ్ బాబు సైతం జూలై 27 నుంచే తమ బ్రాండ్ అందించే ఉత్పత్తుల్లో తగ్గింపు ఉంటుందని స్పష్టంచేశారు.