అంబేద్కర్, మోదీ బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు ఓబీసీ: స్పీకర్ త్రివేది
బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది కూడా ఈ జాబితాలో చేరారు. గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన 'మెగా బ్రహ్మిణ్ బిజినెస్ సమ్మిట్' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన 'అంబేద్కర్‌ను బ్రాహ్మణుడు అనే విషయం చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఆయనకున్న విజ్ఞానం, తెలివితేటల పరంగా చూస్తే అంబేద్కర్ బ్రాహ్మణుడని చెప్పడంలో తప్పేమీ లేదు. అదే విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బ్రాహ్మణుడే అని చెప్తాను' అని త్రివేది అన్నారు.
ఇదే క్రమంలో ఆయన శ్రీకృష్ణుడు గురించి కూడా ప్రస్తావించారు. రాముడు క్షత్రియుడని.. కానీ ఆయనను ఋషులే దేవుడిని చేశారని అన్నారు. కృష్ణుడిని దేవుణ్ణి చేసింది బ్రాహ్మణుడైన సందిపాణి రుషి అని త్రివేది అన్నారు.
అంబేద్కర్ ఇంటిపేరు ఓ బ్రాహ్మిన్‌దేనని.. ఆ పేరును ఓ బ్రాహ్మణుడైన ఆయన ఉపాధ్యాయుడే పెట్టారన్నారు. రాజేంద్ర త్రివేది ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా ఉండటం గమనార్హం. అయితే ఆయన కామెంట్స్‌ను అదే పార్టీకి చెందిన ఎంపీ ఉదిత్‌రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టాన్ని చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు.
భారత రాజ్యంగ పితామహుడు డా.బి.ఆర్.అంబేద్కర్ దళిత కుటుంబంలో జన్మించారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి తీవ్ర కృషి చేశారు. మహిళలు, కార్మికుల కోసం అనేక పోరాటాలు చేశారు.