2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుజరాత్‌పై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు సాధించాలనే పథకంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీని తప్పించేందుకు రంగం సిద్ధం చేశారని పటేల్‌ సామాజిక వర్గ ఉద్యమ నాయకుడు హార్థిక్‌ పటేల్‌ ఆరోపించారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ను రాజీనామా చేయాలని కోరిన తరహాలోనే గురువారం జరిగిన కేబినెట్‌ బేటీలో విజయ్‌ రూపానీని సైతం సీఎం పదవి నుంచి వైదొలగాలని కోరారని తెలిసిందని హార్థిక్ పటేల్ స్పష్టంచేశారు. బీజేపీ అధిష్టానం కోరిక మేరకు ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారని హార్థిక్ పటేల్ ప్రకటించడంతో గుజరాత్ రాజకీయ పరిణామాల్లో మళ్లీ పెను మార్పులు చోటుచేుకుంటున్నాయా అనే చర్చలు మొదలయ్యాయి. రానున్న 10 రోజుల్లో ముఖ్యమంత్రి రాజీనామాను గవర్నర్‌ ఎప్పుడైనా ఆమోదించే అవకాశాలు ఉన్నాయని, విజయ్ రూపానీ తర్వాత గుజరాత్‌ కొత్త ముఖ్యమంత్రిగా క్షత్రియ లేదా పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన వారిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేస్తుందని భావిస్తున్నట్టు హార్థిక్ పటేల్ చెప్పడం ఒకింత చర్చనియాంశమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కి నమోదైన ఓట్ల శాతంలో కొంత పెరుగుదల కనిపించడం, మరోవైపు ఎన్నికల సమయంలో హార్థిక్ పటేల్ ఉద్యమాలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా అనే వాదనలు వినిపించాయి. 


ఇదిలావుంటే, హార్థిక్ పటేల్ చెప్పినట్టుగా తాను రాజీనామా చేస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో అసలు ఏ మాత్రం వాస్తవం లేదని సీఎం విజయ్‌ రూపానీ ప్రకటించారు. హార్థిక్ పటేల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి రూపానీ.. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే అతడు ఈ తరహా దుష్ప్రచారానికి తెర తీశారని ఆరోపించారు. గుజరాత్‌లో బీజేపీని దెబ్బతీసి ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హార్థిక్‌ పటేల్‌ వంటి కాంగ్రెస్‌ ఏజెంట్లు నాటకం ఆడుతున్నారు. ముఖ్యమంత్రుల రాజీనామా అనేది కేబినెట్‌ సమావేశంలో చేసేది కాదు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తారు. అది కూడా తెలుసుకోకుండానే హార్థిక్ పటేల్ తనపై అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారని పటేల్‌ని ఎద్దేవా చేశారు.