2 Free LPG Cylinders: దీపావళి కానుకగా 2 ఎల్పీజీ సిలిండర్లు ఉచితం, సీఎన్జీ, పీఎన్జీపై 10 శాతం వ్యాట్ తగ్గింపు
2 Free LPG Cylinders: దీపావళి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి పండగ కానుకగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
2 Free LPG Cylinders: ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మాత్రమే కాదండోయ్.. రాష్ట్రవ్యాప్తంగా సరఫరా అవుతున్న సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్‌పై విధిస్తున్న వ్యాట్‌లో 10 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించి మరో తీపి కబురు అందించింది. అయితే, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదండోయ్.. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో. అవును.. గుజరాత్ సర్కారు ఆ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న దీపావళి కానుక ఇది.
రెండు ఉచిత సిలిండర్లకు ఎవరు అర్హులంటే..
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న వారికి సంవత్సరానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందివ్వనున్నట్టు గుజరాత్ సర్కారు స్పష్టంచేసింది. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుకోనున్నారు.
గుజరాత్‌లో సీఎన్జీ, పీఎన్జీ ధరలు ఏ మేరకు తగ్గనున్నాయంటే..
కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్‌తో పాటు పైప్డ్ న్యాచురల్ గ్యాస్‌పై విధిస్తున్న వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ 10 శాతం తగ్గించనున్నట్టు ప్రకటించి సీఎన్జీ, పీఎన్జీ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. గుజరాత్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో గుజరాత్‌లో కిలో సీఎన్జీ 7 రూపాయల మేర తగ్గనుండగా పీఎన్జీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కి 6 రూపాయల మేర తగ్గనుంది. గుజరాత్ రాష్ట్ర రవాణా శాఖ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న దాదాపు 14 లక్షల మంది సీఎన్జీ వాహనదారులకు ఊరట లభించనుంది.
సర్కారుపై అదనపు భారం ఎంతంటే..
దేశవ్యాప్తంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ ధరల విషయానికొస్తే.. సుమారు రూ. 1050 గా ఉంది. అందులో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన వారికి ఒక్కో సిలిండర్‌కి రూ. 200 నేరుగా బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతోంది. సీఎన్జీ, పీఎన్జీపై 10 శాతం వ్యాట్ తగ్గింపుతో గుజరాత్ ప్రభుత్వంపై అదనంగా రూ. 1,650 కోట్ల భారం పడనుందని గుజరాత్ విద్యా శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితూ వఘాని తెలిపారు. రూ. 650 కోట్ల గ్రాంట్ ఉపయోగించి రెండు ఉచిత సిలిండర్లకు సంబంధించిన నగదును నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి జితు వాఘాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ కానుకగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి జితు వాఘాని అభిప్రాయపడ్డారు.