బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్యపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డి దేవేగౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తడానికి సిద్ధరామయ్యే కారణమని దేవేగౌడ ఆరోపించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా సిద్ధరామయ్య అనుచరులేనని, వారి రాజీనామా వెనుక సిద్ధరామయ్య కుట్ర ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా తిరిగి వెనక్కి వచ్చేస్తారని ఆశాభావం వ్యక్తంచేసిన కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్.. ఇదే విషయమై చర్చించడానికి దేవేగౌడతో భేటీ అయ్యారు. కుమారస్వామి స్థానంలో మళ్లీ సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిని చేయాలని కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు కోరుతున్నారని, అలా అయితేనే ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకోగలమని డికే శివకుమార్ వివరించగా.. ఆ అభిప్రాయంపై దేవేగౌడ మండిపడినట్టు తెలుస్తోంది. 


కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కుట్రపన్నుతున్నాడు కనుకే తన మద్దతుదారులచేత రాజీనామా చేయించాడని సిద్ధరామయ్యపై తీవ్ర విమర్శలు చేసిన దేవేగౌడ.. ఒకవేళ సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి చేయాల్సి వస్తే, తాము(జేడీఎస్) మద్దతు వెనక్కి తీసుకుంటామని తేల్చిచెప్పారని సమాచారం.