కేంద్ర ఆరోగ్య శాఖ 328 పెయిన్ కిల్లర్లు, ఫిక్స్‌డ్ కాంబినేషన్ డ్రగ్‌లను నిషేదించింది. మరో ఆరు ఔషధాలపై నియంత్రణ విధించింది. ఈ ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఆఫ్ డ్రగ్స్‌ను నిషేధించడం ద్వారా ఔషధ తయారీ సంస్థలతో వివాదానికి కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టనట్లయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించిన వాటిలో సారిడాన్ లాంటి పెయిన్ కిల్లర్, పాన్‌డెర్మ్ స్కిన్ క్రీం, గ్లుకోనార్మ్ పీజీ అనే కాంబినేషన్ డయాబెటిస్ డ్రగ్, యాంటీ బయోటిక్ లుపీడీక్లాక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ట్యాక్సిమ్ ఏజెడ్ లాంటి ఔషధాలు ఉన్నాయి. ఈ సత్వర ఉపశమన మాత్రలతో దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయని పేర్కొంది.


సురక్షితం కాని ఈ ఔషధాలపై నిషేధం విధించడం కోసం ఆరోగ్య శాఖ 2016 నుంచి కసరత్తు చేస్తోంది. 2016లో మార్చి10న 344 డ్రగ్‌లను ప్రభుత్వం నిషేధించగా.. వీటి తయారీ సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. దీంతో ఈ అంశాన్ని పరిశీలించాలని 2017 డిసెంబర్ 15న డ్రగ్ సాంకేతిక సలహా బోర్డు(డీటీఏబీ)కు సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై స్పందించిన డీటీఏబీ.. ఈ 328 ఔషధాల్లో వాడిన పదార్థాలు హానికరమని.. డ్రగ్‌ల నిషేధంలో తప్పులేదని స్పష్టం చేసింది. కాగా 344 ఔషధాలపై ప్రభుత్వం నిషేధం విధించాల్సి ఉండగా.. దగ్గు సిరప్‌లు, జలుబు లాంటి 15 ఉత్పత్తులను మినహాయించింది.