Himachal Cm Candidate: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గురువారం కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీకి 25, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారం మారే సంప్రదాయం కూడా కొనసాగింది. హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. సీఎం పదవి కోసం చాలా మంది పోటీపడుతున్నారు. శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిమాచల్ ప్రదేశ్ తదుపరి సీఎం రేసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ముందున్నారు. ప్రతిభా సింగ్ హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడంపై ఆమె ప్రశంసలు కురిపించారు. కొత్త ఎమ్మెల్యేలతో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై చర్చించి పార్టీ హైకమాండ్‌కు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని అన్నారు.


రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై పార్టీ పరిశీలకులు భూపిందర్ సింగ్ హుడా, భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లాతో సహా సీనియర్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలందరూ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారో ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెబుతారని ప్రతిభా సింగ్ తెలిపారు. ఏ అంగీకారం కుదిరినా పార్టీ హైకమాండ్ ముందు ఉంచుతామన్నారు. వీరభద్ర సింగ్ వారసత్వానికి ఓటు వేసిన ప్రజల మనోభావాలను కూడా హైకమాండ్‌కు తెలియజేస్తామని చెప్పారు. 


వీరభద్ర సింగ్‌కు విధేయులుగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రతిభా సింగ్‌కే ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వీరభద్ర సింగ్ చాలా కాలంగా కాంగ్రెస్‌కు తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. ఆయన గతేడాది మరణించారు. ఆయన కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతిభా సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం మండి ఎంపీగా ఉన్నారు. పార్టీ ప్రతిభా సింగ్‌ను సీఎంగా ఎంపిక చేస్తే.. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. 


కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి కూడా పోటీ పడుతున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ సుఖ్వీందర్ సింగ్ సుఖు, సీనియర్ నేత ఠాకూర్ కౌల్ సింగ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా ముఖ్యమంత్రి పదవి తనకు దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షనిజంతో పోరాడుతున్న పార్టీని ఏకతాటిపైకి తెచ్చామని ఆయన చెబుతున్నారు. ఆయన థియోగ్ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు.


హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో శుక్రవారం సిమ్లాలో కాంగ్రెస్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) నాయకుడిని ఎన్నుకునే అధికారం కాంగ్రెస్ అధ్యక్షుడికి కల్పిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు అందరినీ క్యాంప్‌కు తరలించాలని ముందుగా అనుకున్నా..  ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో తన ప్లాన్ మార్చుకుంది. 


Also Read: Chamika Karunaratne: అయ్యో కరుణరత్నే.. క్యాచ్ కోసం మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు.. వీడియో వైరల్  


Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి