హిందూ మత ప్రచారకుడు స్వామి గోవిందదేవ్ గిర్జీ మహారాజ్ పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో చాలా చోట్ల హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతుందని..  అందుచేత ప్రతీ హిందువు కనీసం నలుగురు పిల్లల్ని కనాల్సిందేనని అభిప్రాయపడ్డారు. జనాభాలో తారతమ్యాలను పసిగట్టే యూనిఫార్మ్ సివిల్ కోడ్ అమలులోకి వచ్చే వరకు హిందువులు ఈ నియమాన్ని పాటించాలని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలోని ఉడుపి ప్రాంతంలో జరిగిన విశ్వహిందు పరిషత్ సమావేశంలోకి పాల్గొనడానికి వచ్చిన గోవింద్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు పిల్లలు చాలని ప్రచారం చేస్తుందని..అయితే యూనిఫార్మ్ సివిల్ కోడ్ వచ్చే వరకు ప్రజలు ఆ నియమం పాటించక్కర్లేదని తెలిపారు. ఒకవేళ ఇద్దరు పిల్లల కలిగుండాలనే పాలసీకే ప్రభుత్వం కట్టుబడితే.. హిందువులకే కాకుండా అదే నియమాన్ని ఇతర మతాలు కూడా పాటించేలా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.


అలాగే గోరక్షకులు ప్రేరేపిస్తున్న హింసపై మాట్లాడుతూ కూడా గోవింద్ దేవ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. "గో రక్షకులు శాంతి ప్రబోధకులు. అయితే కొందరు వారి ముసుగు వేసుకొని కొన్ని అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గోరక్షకుల పేరును పాడు చేయడానికే వీరు కంకణం కట్టుకున్నారు" అని ఆయన తెలిపారు. హరిద్వార్ ప్రాంతంలోని భారత మాత మందిర్ అధినేతగా వ్యవహరిస్తున్న గోవింద్ దేవ్ ఒక ధార్మికవేత్తగా సేవలందిస్తున్నారు.