Kerala Houseboat Capsize Tragedy: కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా తనూర్ ప్రాంతానికి సమీపంలోని తువల్తిరం బీచ్ వద్ద 30 మందితో వెళ్తున్న హౌజ్ బోటు నీట మునిగిపోయింది. కడపటి వార్తలు అందే సమయానికి ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. మృతుల్లో చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. మిగతా వారి ఆచూకీ గల్లంతు కావడంతో వారంతా బోటు కిందే చిక్కుకుపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ రాష్ట్ర మంత్రి అబ్దురహిమాన్ మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన చోటుచేసుకున్నప్పుడు హౌజ్ బోటులో కనీసం 30 మంది ఉన్నారని తెలుస్తోంది అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.40 గంటల మధ్య ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత ఈ దుర్ఘటనలో ఆరుగురే చనిపోయినట్టుగా వార్తలొచ్చినప్పటికీ.. ఆ తరువాత మృతుల సంఖ్య మొత్తం 18 మందికి చేరింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తోంటే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న అధికారులు.



 


ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని మంత్రి అబ్దురహీమాన్ తెలిపారు. ఈ ఘటనలో హౌజ్ బోటు మొత్తం తిరగపడి తలకిందులుగా నీట మునగడంతో చాలామంది ఆ బోటు కిందే చిక్కుకుపోయి ఉంటారని సందేహం వ్యక్తంచేశారు. 



 


కేరళలోని మలప్పురం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.