మరాఠా పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహంగా నిర్మించే దమ్ము మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని శివసేన పార్టీ ప్రశ్నించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ  విషయంలో వివరణ ఇవ్వాలని శివసేన డిమాండ్ చేసింది. శివాజీ విగ్రహాన్ని దేశంలోనే అతి పెద్ద విగ్రహంగా నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రకటన ఇవ్వాలని శివసేన రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. దేవంద్ర ఫడ్నవీస్ నిజంగా మరాఠీయుడు  అయితే శివసేన ప్రతిపాదిస్తున్న తాజా డిమాండ్‌ను అంగీకరించాలని కూడా ఆ పార్టీ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నుండి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయని.. పటేల్ విగ్రహం కంటే ఎత్తైన విగ్రహాన్ని నిర్మించవద్దని.. శివాజీ విగ్రహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలిపారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజనిజాలు ఎంత ఉన్నాయన్న విషయం తమకు అనవసరమని.. శివాజీ విగ్రహాన్ని దేశంలోనే ఎత్తైన విగ్రహంగా నిర్మించకపోతే ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి వస్తుందని శివసేన పార్టీ నేతలు, రాష్ట్ర సీఎంకు తెలియజేయడం జరిగింది. 


ఎప్పటి నుంచో ఎత్తైన శివాజీ విగ్రహాన్ని మహారాష్ట్రలో ప్రతిష్టించాలన్న ప్రతిపాదన ఉందని.. కానీ ఇప్పటి వరకు కనీసం ఈ విగ్రహానికి పునాయిరాయిని కూడా ప్రభుత్వం వేయలేకపోయిందని శివసేన ఎద్దేవా చేసింది. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం.. అందుకు తగ్గ ప్రణాళికను తయారుచేయడం కోసం ఓ కమిటీని వేసింది. వినాయక్ మేటే ఈ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ.. సీఎంకు ఎప్పటికప్పుడు పని పురోగతిని వివరిస్తారని ప్రభుత్వం తెలిపింది. శివాజీ విగ్రహాన్ని నిర్మించడం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా అని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.