ఢిల్లీ: డేరా సచ్ఛా సౌధ అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ చేసిన పాపాల చిట్టా రోజు రోజుకూ పెరుగుతోంది.  డేరాలో  ఈ దొంగ బాబా  సాగించిన అక్రమాలు రోజుకొకటి బయటపడడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతు అవుతోంది. ఇప్పటికే  ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన  కేసులో గుర్మీత్‌ బాబాకు కోర్టు ఇరవై సంవత్సరాల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  బాధితులు అనేకమంది తమకు జరిగిన అన్యాయాలను  బహిర్గతం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో  డేరాకి సంబంధించిన అనేక చీకటి కథలు బయటపడుతున్నాయి. తాజాగా గుర్మీత్  ఆశ్రమంలో జరిగిన మరో ఘోరం బయటకు వచ్చింది. డేరా సచ్ఛా సౌధ కేంద్రంగా మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్‌) వ్యాపారం చేయడం కోసం  కొన్ని ముఠాలను బాబా ప్రోత్సహించినట్లు  వార్తలు వస్తున్నాయి. 


పానిపట్టు ప్రాంతానికి  చెందిన ఓ గృహిణి వాపోతూ,  12 ఏళ్ల క్రితం తన శిశువును  డేరా సచ్ఛా సౌధ ఆశ్రమానికి దానంగా అప్పగించానని, అయితే ఇప్పటివరకు తనకు ఆ బిడ్డ విషయమై డేరా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపింది. తాను గుర్మీత్ బాబా భక్తురాలినని, భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం తమ  పిల్లలను డేరాకు  దానంగా ఇవ్వాలంటూ గతంలో వచ్చిన ఒక పత్రికా ప్రకటనకు ఆకర్షితురాలై తాను బిడ్డను ఆశ్రమానికి అప్పగించినట్లు ఆమె తెలిపింది. దీంతో డేరా ఆశ్రమం కేంద్రంగా మానవ అక్రమ రవాణా జరిగి ఉండొచ్చని పలువురు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.