పూణే : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజే మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన తన భర్త తనకు హెచ్ఐవీ ఇంజక్షన్ చేశాడని ఫిర్యాదు చేస్తూ పూణేలో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పూణేలోని పింప్రీ చించ్వాద్‌లోని పింపుల్ సౌదాగర్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హోమియో డాక్టర్‌‌తో 2015 ఏప్రిల్‌లో వివాహమైంది. వివాహం అనంతరం తన భర్త అదనపు కట్నం తీసుకురమ్మని వేధించడంతో తాను పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి ఇచ్చానని, అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగలేదని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అడిగినంత కట్నం ఇచ్చి, అదనపు కట్నం తీసుకొచ్చిన తర్వాత కూడా తనకు విడాకులు ఇచ్చే ప్రయత్నం చేశారని, అందుకు తాను నిరాకరించడంతో చివరకు గతేడాది అక్టోబర్‌లో హెచ్ఐవీ వైరస్ ఇంజెక్షన్ ఇచ్చి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశారని బాధితురాలు వాపోయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరిలోనే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది అని సమాచారం.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై ఐపీసీ సెక్షన్ 498 ఎ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పూణేలోని వాకాడ్ పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సతీష్ మానె తెలిపారు.