హైదరాబాద్‌ : పౌరసత్వ సవరణ చట్టం 2019, జాతీయ పౌర పట్టికలను వ్యతిరేకిస్తూ ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్‌లో  ప్రజాస్వామ్య వాదులు, మైనార్టీలు ఆందోళన చేపట్టారు. మైనార్టీలను వేధింపులకు గురిచేసేలా ఉన్న పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జాతీయ జెండాలతో వేలాది మంది పౌరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరాపార్క్‌ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టికలపై  కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ-ముస్లిం భాయీ-భాయీ, అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో ఆందోళనకారులు కదం తొక్కారు. భారీ సంఖ్యలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వంతెన పైకి చేరుకుని సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, ఇందిరాపార్కు, ఎల్బీ స్టేడియం, మెహదీపట్నం ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆందోళన కార్యక్రమంలో ఇంత భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనడం ఇదే మొదటిసారి అని నగరవాసులు అంటున్నారు. 


ఇప్పటికే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ, వాటిని వ్యతిరేకించాలని 11 రాష్ట్రాల సీఎంలకు లేఖలు పంపామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వాటివల్ల ముస్లింలకే కాదు దేశ ప్రజలందరికీ ఇబ్బందికరమని ఆయన అన్నారు. అందుకే మా ప్రభుత్వం వాటిని వ్యతిరేకిస్తుందన్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేస్తున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. 


పౌరసత్వ చట్టం వ్యతిరేక ఆందోళనల్లో గాయపడిన బాధితులకు ప్రియాంక గాంధీ పరామర్శ 


పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్, మీరట్‌ల్లో పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనల్లో గాయాలపాలైన వారి కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వెళ్లారు. మొదట ఆమె ముజఫర్‌నగర్ వెళ్లి కొంతమంది బాధితులను కలుసుకున్నారు. అక్కడ నుంచి మీరట్ శివారు ప్రాంతాల్లోని బాధితులను కలుసుకోడానికి వెళ్లారు. సహరన్‌పూర్ కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ మసూద్‌తో కలసి ప్రియాంక ముజఫర్‌నగర్ లోని పోలీసుల దౌర్జన్యానికి గురైన మౌలానా అసద్ రజా హుస్సైనిని కలుసుకున్నారు. 


ఈ విచార సమయంలో మీకు అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పిల్లలు, మైనర్లు, తేడా లేకుండా పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారని, ఏడు నెలల గర్భిణిని కూడా చూడకుండా  పోలీసులు అతిగా ప్రవర్తించడాన్ని ప్రతీ సంఘటనను గవర్నర్ ఆనందిబెన్‌పటేల్‌కు తెలియజేస్తామని ఆమె అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..