అనారోగ్యంతో ఉన్న గోవా ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత సంచలణ ఆరోపణలు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత డా. చెల్లకుమార్ సంచలణ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడుతూ.. మీరు (మనోహర్ పారికర్) ఆరోగ్యంగానే ఉన్నారనే భావిస్తున్నాను అని చెల్లకుమార్ అన్నారు. ఎందుకంటే, మీరు ఆస్పత్రిలో ఉంటూనే అక్కడి నుంచే పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, అందుకు సంబంధించి కొంతమంది బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటూ తనకు సందేశాలు పంపిస్తున్నారని మనోహర్ పారికర్‌పై చెల్లకుమార్ ఆరోపించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రివర్గాలు ఓ మెడికల్ బులెటిన్ విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు మరోసారి వేడెక్కింది.
ఇదిలావుంటే, కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మూడు నెలలపాటు అమెరికాలో చికిత్స పొంది సెప్టెంబర్ మొదటివారంలోనే గోవాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గోవాకు తిరిగొచ్చిన అనంతరం సైతం మనోహర్ పారికర్ మరోసారి అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు ఇటీవలె గోవా ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు పేర్కొన్నాయి.