పార్లమెంట్‌లో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు ఎన్నో పెద్ద పెద్ద హామీలు గుప్పించిన మోదీ సర్కార్.. ఇప్పటివరకు అందులో ఏవీ పూర్తిగా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నో పార్టీల మాదిరిగానే బీజేపీ జిమ్మిక్కులకు టీడీపీ కూడా బలైందని రాహుల్ గాంధీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రఫెల్ ఒప్పందం విషయంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వాస్తవాలు దాచిపెట్టి, అవాస్తవాలు వెల్లడిస్తున్నారు. రఫెల్ వివాదంపై రక్షణ శాఖ మంత్రి, ప్రధాన మంత్రి నిజాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 


అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.
* నేను మీకు (బీజేపీ) పప్పునే కావచ్చేమో కానీ నేను మాత్రం కాంగ్రెస్ వాదినే. మీపై నాకు ఎటువంటి ద్వేషం లేదు.
* దేశంలో యువత మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఇక్కడ చేదు నిజం ఏంటంటే, దేశంలో కేవలం 4 లక్షల మంది యువతకు మాత్రమే ఉపాధి లభించింది. చైనాలో 24 గంటల్లో 50,000 మందికి ఉపాధి లభిస్తుండగా అదే    సమయంలో భారత్‌లో కేవలం 400 మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. 
*ఆయనకు ఎవరి నుంచి ఎలాంటి సందేశం అందిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఓ రోజు అర్ధరాత్రి నుంచి పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అంటూ రాహుల్ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీకి చురకలు అంటించే ప్రయత్నం చేశారు. 
* హెచ్ఏఎల్ నుంచి విమానాల తయారీ కాంట్రాక్ట్ రద్దు చేసుకుని జీవితంలో ఒక్క విమానం కూడా తయారు చేయని ఓ వ్యాపారవేత్తకు ఆ కాంట్రాక్టుని ఎందుకు అప్పగించారో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మోదీ గారు నవ్వుతున్నారు కానీ నా కళ్లలోకి కళ్లుపెట్టి చూసే ధైర్యం ఆయనకు లేదు. 
* మీ మంత్రి రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని చెబుతున్నారు అంటే, అది రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌పై దాడికి పాల్పడటంతోపాటు దేశంపై దాడికి పాల్పడినట్టే అవుతుంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సర్కార్‌పై రాహుల్ విరుచుకుపడ్డారు.