పొగత్రాగరాదు అని బోర్డులు పెట్టినట్లే.. గంగానది నీళ్లు తాగొద్దని బోర్డులు పెట్టండి: ఎన్‌జీటీ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇటీవలే `క్లీన్ గంగా` క్యాంపైన్ ప్రారంభించిన జాతీయ మిషన్‌కి ఆదేశాలు జారీచేసింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఇటీవలే "క్లీన్ గంగా" క్యాంపైన్ ప్రారంభించిన జాతీయ మిషన్‌కి ఆదేశాలు జారీచేసింది. గంగా నది ప్రాంతానికి ప్రతీ 100 కిలోమీటర్ల దూరంలో గంగానది జలాలు తాగడానికి, స్నానం చేయడానికి అనువు కాదని చెబుతూ బోర్డులు పెట్టమని ఎన్‌జీటీ తెలిపింది. "ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పొగత్రాగరాదు అని ఎక్కడికక్కడ బోర్డులు పెట్టే ప్రభుత్వం... గంగానది విషయంలో కూడా చొరవ తీసుకోవాలి. స్థానిక అడ్మినిస్ట్రేషన్ వెంటనే స్పందించి "గంగానదిలో స్నానమాచరించడం, గంగా జలాలు సేవించడం ఆరోగ్యానికి ముప్పు" అని అర్థం వచ్చేలా బోర్డులు పెట్టాలని ఎన్‌జీటీ తెలియజేసింది.
హరిద్వార్, ఉన్నావో ప్రాంతాల మధ్య ప్రవహించే గంగానది ఎంతో అపరిశుభ్రంగా ఉందని.. దుర్గంధ భూయిష్టంగా తయారైందని.. అలాంటి నీటిలో స్నానమాచరించమని.. ఆ నీళ్లు తాగమని చెప్పడం మూర్ఖత్వమని బోర్డు పేర్కొంది. "అసలు మన దేశ జనాలకు గంగానది ఎంత అపరిశుభ్రంగా, దుర్గంధభరితంగా తయారైందో తెలుసా? తెలుసనే అనుకుంటున్నాం. అయినా సరే అందులోనే ఆచమనమ్ ఇత్యాది పూజాధికాలు నిర్వహించి స్వర్గానికి చేరుకుంటున్నామని భావిస్తున్నారు. నిజమే.. ఆ నీళ్లు తాగితే నిజంగానే ప్రతీ ఒక్కరూ స్వర్గస్థులవ్వడం ఖాయం" అని ట్రిబ్యునల్ పేర్కొంది.
ఒకవేళ గంగా నదిలో కొంత భాగాన్ని ప్రభుత్వం శుభ్రపరిచిందని భావిస్తే.. ఆ ప్రాంతాలు ఏమిటో ప్రజలకు తెలియజేసే బాధ్యతలను ఎన్‌ఎంసీజీ మరియు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తీసుకోవాలని ట్రిబ్యునల్ తెలిపింది. "ముఖ్యంగా గంగానదిలో కొంత భాగం బాగా దుర్గంధభరితంగా తయారైంది. ఆ జలాలు మనుషులకే కాదు.. పర్యావరణానికి కూడా ఎంతో ప్రమాదకరం. ఆ నీళ్లు భూగర్భజలాలతో కలవకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలు కూడా వ్యర్థాలతో గంగా జలాలను కలుషితం చేయడం మానుకోవాలి" అని ట్రిబ్యునల్ తరఫున జస్టిస్ ఎస్పీ వాంగ్డీ తెలిపారు.