కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడ్యూరప్ప ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్లీ నోరు జారి ప్రతిపక్షాల విమర్శలకు గురయ్యారు. శనివారం బెల్గావి ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ "అవిశ్రాంతంగా మీరు పనిచేయాల్సిన సమయం వచ్చింది. ఎవరైనా ప్రజలు ఓటుహక్కు ఉపయోగించుకోవడానికి మొగ్గు చూపకపోతే..కాళ్లు, చేతులు కట్టి మరీ తీసుకొచ్చి మన అభ్యర్థికి ఓటు వేయించండి" అని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ మాటలు పెను దుమారమే రేపాయి. ఎడ్యూరప్ప మాటలు ఓటర్లను భయపెట్టేవిధంగా ఉన్నాయని పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేవిధంగా ఆయన మాట్లాడుతున్నారని.. ఓటర్లను గౌరవించకుండా పిచ్చి ప్రేలాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంతకు క్రితమే రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో భారత ప్రధాని మోదీపై విరుచుపడ్డారు. మైనింగ్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబలోని 8 మందికి ఆయన టిక్కెట్లు ఎలా ఇస్తారని మోదీని ప్రశ్నించారు. అలాగే ఎడ్యూరప్ప విషయంలో కూడా ఆయనపై ఉన్న అవినీతి కేసులను బీజేపీ కొట్టివేయించిందని.. ఆయన మళ్లీ రాష్ట్ర సీఎం అయితే దొంగలు ఊర్లు పంచుకున్న విధంగా కర్ణాటక పరిస్థితి తయారవుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.


అయితే బీజేపీ నేతల మాటలేవీ పట్టించుకోవద్దని.. తాను ముఖ్యమంత్రి అయ్యాక, విధాన సౌధలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఎడ్యూరప్ప తన ప్రచారంలో భాగంగా కార్యకర్తలకు తెలిపారు. పార్టీ విజయానికి అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికలు మే 12వ తేదిన జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు మే 15వ తేదిన వెలువడతాయి.