న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమక్రమంగా దేశం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. మొదట ఈశాన్య భారతంలోని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ ఆందోళనలు.. ఆ తర్వాత ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకూ వ్యాపించాయి. ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలోకి ప్రవేశించిన పోలీసులు.. అక్కడ కంటికి కనిపించిన విద్యార్థులు, సిబ్బందిపైనా లాఠీచార్జ్ చేసి వారిని గాయపర్చారని యూనివర్శిటీ ఆరోపించింది. యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ నజ్మా అక్తర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. యూనివర్శిటీలోకి పోలీసుల ప్రవేశం, లాఠీచార్జ్‌ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన నజ్మా అక్తర్.. యూనివర్శిటీ విద్యార్థులను ఈ ఉచ్చులోకి లాగి వారి భవిష్యత్‌ని నాశనం చేయొద్దని విజ్ఞప్తిచేశారు. ధ్వంసమైన ఆస్తులను తిరిగి నిర్మించుకోవచ్చు కానీ.. విద్యార్థులకు వారు నష్టపోయిన వాటిని తిరిగివ్వలేరని నజ్మా అక్తర్ అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఢిల్లీలోని జామియా నగర్‌తో అంతమవలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘడ్, మవులోనూ పౌరసత్వ సవరణ చట్టం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలోనూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనలు హింసకు దారితీశాయి. మరోవైపు మవులో ఆందోళనకారులు పోలీసు స్టేషన్‌కి నిప్పంటించి తమ నిరసన తెలియజేశారు. దీంతో మవులో కర్ఫ్యూ విధించారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన యూపీ సర్కార్.. నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. మీరట్, సహరన్‌పూర్, అలీఘడ్, మవు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా హింస పెచ్చుమీరే ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో యూపీ సర్కార్ ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. 


బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం..
దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణిచేసేందుకు పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తర్ ప్రదేశ్యలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు తమ పార్టీ పార్లమెంటరీ నేతలు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారని.. అలాగే యూపీ అసెంబ్లీలోనూ తాము ఈ అంశాన్ని లేవనెత్తుతామని మాయావతి ప్రకటించారు.