మొబైల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో ప్రతిష్టాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే టికెట్ చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐఆర్‌‌సీటీసీ తెలిపింది. ఇకమీదట 10 కోట్ల మంది ఫోన్‌పే ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించి యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు ఫోన్‌పే వాలెట్ ద్వారా ప్రయాణాన్ని బుక్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఐ.ఆర్.సి.టి.సీలో భాగస్వామి అయినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ  భాగస్వామ్యం ద్వారా మేము భారతదేశమంతటా డిజిటల్ చెల్లింపులను పెంచడానికి ప్రయత్నిస్తాము. రైల్ కనెక్ట్ యాప్ ద్వారా టికెట్ల బుకింగ్ మరింత సులభతరం చేయడంలో ఫోన్‌పే ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో యూజర్ ఎంచుకున్న ఏ పద్ధతుల్లో అయినా (యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు, ఫోన్‌పే వాలెట్) త్వరగా, ఇబ్బంది లేకుండా టికెట్ బుక్ చేసుకోవచ్చు' అని ఫోన్‌పే ప్రతినిధి కార్తీక్ రఘుపతి తెలిపారు. ఈ భాగస్వామ్యం ఐఆర్‌సీటీసీ ప్రయాణీకులకు గొప్ప అనుభూతినిస్తుందని, డిజిటల్ చెల్లింపుల యొక్క ప్రయోజనాలను వినియోగదారులకు విస్తృత స్థాయిలో అందిస్తుందని అన్నారు.


ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ ఫోన్‌పే యాప్ ద్వారా ఐఆర్‌సీటీసీలో రైలు, విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు ఐఆర్‌సీటీసీతో రోజర్‌పే, మోబిక్‌విక్, జాక్‌పే, పేటీయం, పేయూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మేక్‌మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఈజ్‌మై ట్రిప్, రెడ్ బస్, అభి బస్, గోఐబిబోలలో ఫోన్‌పే అందుబాటులో ఉంది.


కాగా దేశ వ్యాప్తంగా రోజూ 7 లక్షల ఈ టికెట్లు బుక్ అవుతుండగా.. ఈ కొత్త బుకింగ్ విధానంతో రైల్వే టికెట్ల జారీ విధానంలో వేగం పెరగనుంది.