ప్రభుత్వం మహిళల అత్యాచార ఘటనలపై ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా.. వారిపై దాడులు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మానవ మృగాళ్ల చేతుల్లో అభంశుభం తెలియని చిన్నారులూ  బలైపోతూనే ఉన్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణమైన ఘటన జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పథకం ప్రకారం బాలిక సవతి తల్లి ఈ అఘాయిత్యం చేయించిందని పోలీసులు తెలిపారు. ఆమె 14 ఏళ్ల కుమారుడు, అతని ముగ్గురు స్నేహితులు కలిసి బాలికపై అత్యాచారం చేశారని, అనంతరం గొడ్డలితో చిన్నారి తలను నరికి అతి దారుణంగా చంపేశారన్నారు. అంతటితో ఆగకుండా చిన్నారి కళ్లు పీకి, శరీరంపై యాసిడ్‌ పోసి తగలబెట్టారన్నారు. కాలిన మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో చెట్లపొదల్లో పడేశారన్నారు. సంఘటన స్థలం వద్ద వెపన్స్, యాసిడ్ తీసుకొచ్చిన బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మైనర్లతో సహా మొత్తం ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు. దారుణానికి ఒడిగట్లిన చిన్నారి సవతి తల్లి, ఆమె కుమారుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. తమ కెరీర్‌లో ఇంతటి క్రూరమైన నేరాన్ని చూడలేదన్న పోలీసులు చిన్నారి మృతికి సంతాపం తెలియజేశారు.