భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మళ్లీ తెరమీదికి వచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఈ విషయం గురించి తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవలే ఉత్తరం రాశారు. 60 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో పీవీ నరసింహారావు ఎన్నో పదవులను అధిరోహించారని.. ఆయనను రాజకీయ చాణక్యుడిగా అభివర్ణించవచ్చని పేర్కొన్నారు. గత అనేక సంవత్సరాలుగా భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా గతంలో పీవీకి భారతరత్న ఇస్తే బాగుంటుందని తెలిపారు. తాజాగా జానారెడ్డి కూడా మరోమారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాయడంతో మళ్లీ ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


కరీంనగర్ జిల్లాలో జూన్ 28, 1921 తేదిన జన్మించిన పీవీ నరసింహారావు బహుభాషా కోవిదులు. 1991 నుండి 1996 వరకు ఆయన భారత ప్రధానిగా సేవలందించారు. "భారత ఆర్థిక సంస్కరణల పితామహుడి"గా కొందరు ఆయనను అభివర్ణిస్తుంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసిన పీవీ, నాగపూర్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1971 నుండి 1973 వరకు పీవీ ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా కూడా వ్యవహరించారు.