కర్ణాటక రాజకీయాలు తిరిగి తిరిగి హైదరాబాద్ వచ్చి చేరాయి. నిన్న కర్ణాటకలో సీఎంగా బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశాక.. బల నిరూపణ పరీక్ష కోసం అసలు సిసలైన కసరత్తులు మొదలయ్యాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ నాయకులు కొందరు ప్రయత్నిస్తున్నారని వార్తలు వెలువడడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో  కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను తొలుత విమానాల ద్వారా కేరళ పంపించాలని భావించినట్లు సమాచారం. అయితే తర్వాత ఆ ఆలోచనను విరమించుకొని.. ఎమ్మెల్యేలు అందరినీ బస్సులలో తెలంగాణ రాష్ట్రానికి తరలించాయి. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో ఎమ్మెల్యేలకు గదులు కూడా బుక్ చేశాయి. ఈ క్రమంలో వచ్చిన ముందస్తు సమాచారం మేరకు, భాగ్యనగరంలోని ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.


అయితే భాగ్యనగరంలో చిక్కుకున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు ఎలా కలుస్తారన్న విషయం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే నిన్నే కొందరు ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు మాట్లాడినట్లు సమాచారం. అంతకు క్రితం జేడీస్ నేత కుమారస్వామి కూడా సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీల నుండి ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చి బీజేపీ తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపణలు చేశారు.


బీజేపీ ఇలా నాయకులను ప్రలోభపెట్టడం మానుకోవాలని కూడా ఆయన హితవు పలికారు. మొత్తానికి కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన అతి కీలకమైన ఘట్టానికి వేదిక హైదరాబాద్ కావడం కూడా పలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.