పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు.. విమాన ప్రయాణికుల జేబుకు మరింత చిల్లు!
విమానయానం మరింత ప్రియం
రోడ్లపై వాహనాలు నడపడమే కాదు... ఇకపై విమానయానం కూడా ఖరీదైన వ్యవహారమే కానుంది. అందుకు కారణం విమానాల్లో వినియోగించే జెట్ ఫ్యూయల్ అనే ఇంధనం ధరలు సైతం అమాంతం పెరగడమే. అవును, నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా 7% గరిష్ట స్థాయిలో జెట్ ఫ్యూయల్ ధరలు పెరిగాయి. ఈ జెట్ ఫ్యూయల్‌నే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అని కూడా అంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా జెట్ ఫ్యూయల్ ధరలు పెంచుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 7.17 % ధర పెరుగుదల కారణంగా కిలో లీటర్ జెట్ ఫ్యూయల్ ధర రూ.4,688 పెరిగింది. మే 1వ తేదీన జెట్ ఫ్యూయల్ ధరలు కిలో లీటర్‌కి 3,890 (6.3 %) చొప్పున పెరిగింది. ఆ తర్వాత నేడు పెరిగిన ధరలతో మొత్తం పెరుగుదల 7.17 శాతానికి చేరుకుంది. 2014 మే తర్వాత జెట్ ఫ్యూయల్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లోని ధరల పట్టిక ప్రకారం.. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో కిలో లీటర్ జెట్ ఫ్యూయల్ ధర రూ.70,028కి చేరుకోగా కోల్‌కతాలో 74,599, ముంబైలో రూ. 69,603, చెన్నైలో 70,751గా వుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్టు ఐఓసీఎల్ పేర్కొంది.