తనని హతమారుస్తానని బెదిరిస్తూ రవి పూజారి అనే గ్యాంగ్ స్టర్ నుంచి గత మూడు రోజులుగా ఫోన్ కాల్స్ వస్తున్నట్టు ఆరోపించారు ప్రముఖ సామాజిక కార్యకర్త, గుజరాత్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన దళిత నేత జిగ్నేష్ మెవాని. ఆస్ట్రేలియా నుంచి తనని తాను గ్యాంగ్ స్టర్ రవి పూజారిగా పరిచయం చేసుకుంటున్న ఓ వ్యక్తి గత మూడు రోజులుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, మూడో రోజైన ఈ రోజు తన పాత నెంబర్‌కి ఆ కాల్ వచ్చిందంటూ జిగ్నేష్ మెవాని ట్విటర్ ద్వారా ప్రకటించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు ఆపకపోతే కాల్చి చంపేస్తానని, ఉమర్ ఖలీద్ కూడా తన హిట్ లిస్ట్ జాబితాలో ఉన్నాడని సదరు గ్యాంగ్‌స్టర్ టెక్ట్స్ మెసేజ్ కూడా పంపించినట్టు జిగ్నేష్ మెవాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

తనకి తరచుగా బెదిరింపు కాల్స్, సందేశాలు రావడంపై జిగ్నేష్ మెవాని స్పందిస్తూ ఈ కుట్ర వెనుక బీజేపీ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు తెలిపారు. తనని హతమార్చడం ద్వారా బీజేపీ తమకు ఎదురులేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని మెవాని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మెవాని చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ ఏమని స్పందిస్తుందో చూడాలి మరి.