జేఎన్‌యూలో `బిర్యానీ` గోల..!
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థి ఒకరు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మెట్ల దగ్గర స్వయంగా బిర్యానీ వండి విద్యార్థులకు సరఫరా చేసినందుకు విశ్వవిద్యాలయ చీఫ్ ప్రొక్టార్ అతనిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరిగింది.
ఈ సంవత్సరం జూన్ 27వ తేదీన జరిగిన ఈ సంఘటనపై మాట్లాడుతూ ప్రొక్టార్ ఇటీవల ఓ ప్రకటన కూడా జారీ చేశారు. ఇలాంటి ఘటనలను తాము చాలా సీరియస్‌గా పరిగణిస్తామని.. ఇదే యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న అమిర్ మాలిక్ అనే విద్యార్థి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బిర్యానీ వండి విద్యార్థులకు పంచిపెట్టినందుకు, తనకు 6000 రూపాయలను జరిమానా విధిస్తున్నామని తెలిపారు.
ఆ మొత్తాన్ని తను ఈ నెల 10వ తేదీలోగా చెల్లించాలని ప్రొక్టార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇకపై అలాంటి పనులు చేస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇదే విషయంపై జేఎన్‌యూఎస్‌యు జనరల్ సెక్రటరీ సత్రుపా చక్రవర్తి మాట్లాడుతూ "ఎబీవీపికి చెందిన సౌరభ్ శర్మ ఈ సంఘటన ద్వారా అంతర్గత కలహాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
విశ్వవిద్యాలయంలో బీఫ్ బిర్యానీ వండారని దుష్ప్రచారం చేస్తూ ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం చేస్తున్నారు. అలాంటి అవాస్తవాలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. గుజరాత్ ఎన్నికలు వస్తున్న క్రమంలో ఇలాంటి పనులకు వారు శ్రీకారం చుట్టడం సాధారణ విషయమైపోయింది.
యూనివర్సిటీ విద్యార్థి అయ్యి ఉండి కూడా, సౌరభ్ విద్యార్థులకు అన్యాయం జరగుతున్నప్పుడు వారికి అండగా ఉండకుండా.. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం విచారకరం. ఆయన ఇక నుండి తన పద్ధతి మార్చుకుంటే మంచిది. జనాలకు ఆహారస్వేచ్ఛ ఉందనే విషయాన్ని ఆయన మర్చిపోయారేమో" అని ఆమె అభిప్రాయపడ్డారు. జేఎన్‌యూలో గత కొంతకాలంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన వర్గాలు, విద్యార్థి సంఘాలను ప్రభావితం చేస్తున్నాయని వాదనలు వస్తున్న సంగతి తెలిసిందే.