న్యూఢిల్లీ: ఈశాన్య హైకోర్టులలో జడ్జీల భర్తీపై సుప్రీంకోర్టు-కేంద్రం మధ్య శుక్రవారం మాటల యుద్ధం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నియామకాలు (40 పోస్టులకు) అవసరం ఉండగా కేవలం  కొలీజియం మూడు పేర్లే ఇవ్వడంతో దుమారం చెలరేగింది. 'పేర్లివ్వకుంటే భర్తీ చెయ్యలేం' అని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ తెలిపారు. దీంతో ఆగ్రహించిన కోర్టు గతంలో చెప్పినవారిలో ఎంతమంది పెండింగ్‌లో ఉన్నారు... వారి నియామకాలెప్పుడు' అని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన బెంచ్‌ నిలదీసింది.


‘జస్టిస్‌ యూకూబ్‌ మిర్‌, జస్టిస్‌ రామలింగం సుధాకర్‌లను మేఘాలయ, మణిపూర్‌ల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేశాం. దాన్ని ఏం చేశారు? ఎందుకు వారికి నియామకపత్రాలు ఇవ్వలేదు?' అని ధర్మాసనం అడిగినప్పుడు.. 'చూసి తర్వలో చెప్తాం' అని ఏజీ బదులిచ్చారు. దీంతో 'త్వరలో అంటే ఏంటీ? మీరు ఈ మాట చెబుతూ మూడు నెలలయింది' అని కోర్టు మండిపడింది.