బుధవారం పరమపదించిన కంచి 69వ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ క్రతువు పూర్తయింది. బృందావనంలో ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి(70వ కంచి పీఠాధిపతి) అధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆయనకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలగాలంటూ ప్రత్యేక మంత్రాలు చదివారు. పుణ్యాహవాచనం, అభిషేకం అనంతరం చంద్రశేఖరేంద్ర స్వామి బృందావనం పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధిలోకి ప్రవేశం చేశారు. సమాధిని మూలికలు, చందనం చెక్కలతో నింపారు. ఈ క్రతువును చూసేందుకు అనేకమంది భక్తులు తరలివచ్చారు. తమిళనాడు రాష్ట్ర  గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, డాలర్ శేషాద్రి, టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు నివాళులు అర్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది కూడా చదవండి: కంచి మఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్తమయం


ఉదయం వరకు భక్తుల సందర్శనార్థం శ్రీ జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని ఉంచారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని శిష్య బృందం బృందావనం తీసుకొచ్చారు. శ్రీ జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని వెదురు బుట్టలో ఉంచి లాంఛనంగా కపాలమోక్షం కార్యక్రమాన్ని పూజారులు జరిపించారు. భక్తులు అశ్రునయనాల మధ్యే ఈ కార్యక్రమాన్ని చూశారు.