కుమార కేబినెట్ రాజీనామా..అయినా ప్రభుత్వానికి ధోకా లేదంటున్న సీఎం
కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి
కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో పడిన ప్రభుత్వానికి గట్టెక్కించేందుకు జేడీఎస్-కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. అసమ్మతి నేతలను ఏదో రకంగా బుజ్జగించాలనే ప్రయతాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసమ్మతి నేతలకు మంత్రి పదవుల ఆఫర్ ఇస్తున్నారు.
త్యాగాలకు సిద్ధపడ్డ మంత్రులు
రెబల్స్ కు కేబినెట్ చోటు కల్పించేందుకు మంత్రులు త్యాగాలకు సిద్ధపడ్డారు. తొలుత కాంగ్రెస్‌కు చెందిన 21 మంది మంత్రులు రాజీనామా చేయగా.. జేడీఎస్ మంత్రులు కూడా తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎంఓ కార్యాలయం ప్రకటించింది.
ప్రభుత్వానికి ధోకా లేదంటున్న సీఎం
తాజా పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి కుమారస్వామి జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రభుత్వం సజావుగా సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు సంక్షోభంతో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని...త్వరలోనే సమస్య సద్దుమణుగుతుందని పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.