karnataka Elections Results 2023 Winners List: ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్‌దేనని కన్నడీగులు డిసైడ్‌ చేశారు. సర్వేరాయుళ్ల అంచనాలకు మించి కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లను అందించారు. కొన్ని సర్వే రిపోర్ట్స్‌ కాంగ్రెస్‌కు అధిక సీట్లు వచ్చినా... హంగు వచ్చే ఛాన్స్‌ ఉన్నాయంటూ ఊదరగొట్టాయి. అవేమి కాదన్నట్లుగా కాంగ్రెస్‌ గతంలో కంటే 56 సీట్లు ఎక్కువగా అంటే... 136 సీట్లను కైవసం చేసుకుంది. బంపర్‌ మెజార్టీతో కర్ణాటక హస్తగతం అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ భారీ మూల్యాన్నిచెల్లించుకున్నట్లుయ్యింది. బీజేపి గతంలో సాధించిన సీట్లలో 37 సీట్లను చేజార్చుకుని 65 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇక జేడీఎస్ విషయానికొస్తే గతంలో కంటే ఈ సారి 18 సీట్లను కోల్పోయి... కేవలం 19 సీట్లకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇండిపెండెంట్స్‌ ఈ సారి తమ ప్రభావాన్ని కాస్త చూపారని చెప్పవచ్చు. గతంలో కంటే కొంత మెరుగైన స్థితిలో ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలతో ఫుల్‌ ఖుషీలో ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామికి తీవ్ర నిరాశే ఎదురైంది. కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి బంపర్‌ మెజార్టీ రావటంతో కింగ్‌ లేదా కింగ్‌ మేకర్‌ కావాలని ఆశించిన ఆయన ఆశలు గల్లంతయ్యాయి. 


మాజీ సీఎం యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి బొమ్మైకి ఆ పదవిని కట్టబెట్టడంతో లింగాయత్‌లు బీజేపీపై గుర్రుగా ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఎన్నికల్లో వారి కోపాన్ని చూపించారు. బీజేపీని కాదని.. కాంగ్రెస్‌కు జై కొట్టారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తొలగిచటం బీజేపీ తగిన మూల్యం చెల్లంచుకుంది. కర్ణాటకలో 20 శాతం వున్న లింగాయత్‌లు 69 స్థానాల్లో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. 


ఇక కాంగ్రెస్‌ విషయానికొస్తే... గతంలో కంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక జేడీఎస్ పార్టీ విషయానికొస్తే లింగాయత్‌ ప్రాభల్యం ఉన్న చోట ఐదు స్థానాలు దక్కించుకున్న జేడీఎస్.. ఈ సారి ఒక్క స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. 


మరోవైపు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లిఖార్జున ఖర్గే బెంగళూరుకు రావాలని ఆదేశించారు. రేపు సీఎల్పీ మీటింగ్‌ తరువాత... కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరో తేలనుంది. ఇంకోవైపు...  సీఎం అభ్యర్థి రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ ఉన్నారు. అయితే... ఎవరికి వారే... సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఇరువురు నేతలు ప్రకటించారు.


ఇదిలావుంటే, కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. మంచి మెజార్టీ ఇచ్చిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ఎన్నికలను పెట్టుబడిదారులకు, పేదలకు మధ్య జరిగిన ఎన్నికలుగా రాహుల్‌ అభివర్ణించారు. ఈ యుద్ధంలో పేదలు గెలిచారన్నారు. కర్ణాటకకు ఇచ్చిన ఐదు ప్రధాన హామీలను మొదటి కేబినెట్‌లోనే ఆమోదం పొందుతాయని రాహుల్‌ అన్నారు. 


రాహుల్‌ గాంధీ చేపట్టిన పాదయాత్ర భారత్‌ జోడో యాత్రతోపాటు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. రాహుల్‌ 51 నియోజకవర్గాల గుండా జోడో యాత్ర సాగగా... 38 మంది గెలుపొందారు. అదేవిధంగా రాహుల్‌ 22 ప్రాంతాల్లో రాల్యీలు నిర్వహించగా.. 16 మంది అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు... ప్రియాంకా గాంధీ 27 చోట్ల ర్యాలీలు నిర్వహించగా 17 మంది గెలుపొందటం కాంగ్రెస్‌కు గట్టి బూష్ట్‌నిచ్చినట్లు అయ్యింది. 


కర్ణాటకలో కమలం వికసించేలా చేయాలని ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కర్ణాటకలో తిరిగి అధికారం సాధించి... దక్షిణంలో కాషాయం జెండా ఎగరవేయాలని భావించారు. ఏకంగా 42 నియోజకవర్గాల్లో మోదీ ప్రచారం చేయగా... 22 స్థానాల్లో ఓడిపోయి, 20 స్థానాల్లో గెలిచి పరువు నిలుపుకున్నారు. 


అమిత్‌ షా ఏకంగా 30 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించగా... 19 చోట్ల బీజేపీ ఓడిపోయింది. 11 స్థానాల్లో గెలుపొంది బతుకు జీవుడా అని బయటపడ్డారు. గత ఎన్నికలో 104 సీట్లతో అధికారంలోకి వచ్చిన కమల దళానికి ఈ సారి కర్ణాటక ఓటర్లు గట్టి షాక్‌నిచ్చారు. 65 సీట్లను గెలుచుకుని మరో 39 సీట్లను కోల్పోయింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అదనంగా 54 సీట్లను, ఇతరులు 9 సీట్లను అదనంగా గెలుపొందారు. 


మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 40 శాతం కమీషన్‌ ప్రచారం బీజేపీని బాగా దెబ్బతీసింది. కాంగ్రెస్‌ లేవనెత్తిన త్రిబుల్ సీ.. క్యాష్‌, కమ్యూనిటీ, సిలిండర్‌ కమలనాథులను కోలుకోలేని విధంగ దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. రాబోయే 2023 ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్‌కు మంచి ఉపశమనం ఇవ్వగా... బీజేపీలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. 
రీజినల్‌ వైజ్‌గా చూస్తే.. బెంగళూరులో 28 స్థానాలకు గాను బీజేపీ - 15, కాంగ్రెస్‌ -13 స్థానాల్లో గెలుపొందింది. సెంట్రల్‌ కర్ణాటకలో 23 స్థానాలకు గాను బీజేపీ - 6, కాంగ్రెస్‌ -15, జేడీఎస్ - 1, ఇండిపెండెంట్‌ ఒక్క స్థానంలో గెలుపొందారు. ఇక కోస్టల్ కర్ణాటక విషయానికొస్తే బీజేపీ - 12, కాంగ్రెస్‌ -6, జేడీఎస్ - 1 స్థానంలో గెలుపొందాయి.


40 నియోజకవర్గాలున్న హైదరాబాద్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం సాధించింది.  40 నియోజకవర్గాల్లో బీజేపీ - 10, కాంగ్రెస్‌ -26, జేడీఎస్ - 3, గాలి జనార్థన్‌రెడ్డి పార్టీకేఆర్పీపీ ఒక్క స్థానంలో గెలుపొందాయి. ముంబై కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తన దూకుడును కొనసాగించింది. కాంగ్రెస్‌ - 33, బీజేపీ - 16, JDS - 1 స్థానంలో గెలుపొందాయి. రీజినల్‌లో అత్యధికంగా 64 నియోజకవర్గాలున్నఓల్డ్‌ మైసూర్‌లో కాంగ్రెస్‌ తనకు తిరుగే లేదని నిరూపించింది. బీజేపీని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు ఇక్కడి ఓటర్లు. కాంగ్రెస్‌ - 44, జేడీఎస్ - 14, SKP, ఇండిపెండెంట్‌ ఒక్కో స్థానంలో గెలుపొందగా.. బీజేపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 


ఇక 100 నుంచి 1000 ఓట్ల మార్జిన్‌తో గెలుపొందిన సీట్ల విషయానికొస్తే...
100 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌, బీజేపీ చెరో సీటును గెలిచాయి. 500 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ నాలుగు, బీజేపీ ఒక్క స్థానం గెలుపొందింది. ఇక వెయ్యి ఓట్ల మార్జిన్‌లో కాంగ్రెస్‌ ఏడు, బీజేపీ మూడు, జేడీఎస్ ఒక్క స్థానం గెలుపొందాయి. పది వేల మెజార్టీలో 83 మంది అభ్యర్థులు గెలుపొందారు. వారిలో కాంగ్రెస్‌లో 49 మంది, బీజేపీలో 25 మంది, జేడీఎస్ లో 8 మంది, గాలి జనార్థన్‌రెడ్డి పార్టీ KRPP నుంచి ఒక్క అభ్యర్థి ఉన్నారు. 20 వేల మార్జిన్‌లో 139 మంది అభ్యర్థులు గెలిచారు. ఆ జాబితాలో కాంగ్రెస్‌లో 80 మంది, బీజేపీలో 41 మంది, జేడీఎస్ పార్టీలో 15 మంది, SKP, KRPP, ఇండిపెండెంట్‌ ఒక్కో స్థానం నుంచి గెలిపొందారు. ఇక 50 వేల ఓట్ల తేడాలో 24 మంది గెలిచారు. అందులో కాంగ్రెస్‌ నుంచి 10, బీజేపీ నుంచి నాలుగు స్థానాల్లో గెలుపొందారు. లక్ష మెజార్టీతో ఒకే ఒక్కడిగా కాంగ్రెస్‌ అభ్యర్థి DK శివకుమార్‌ గెలుపొంది రికార్డ్‌ సృష్టించారు. 


కులాల వారీగా ఓ సారి చూస్తే....
బ్రాహ్మాణ సామాజిక వర్గం నుంచి 10 మంది పోటీ చేయగా.... బీజేపీ - 6, కాంగ్రెస్‌ - 3, జేడీఎస్ నుంచి ఒక్కరు గెలుపొందారు.


కురుబ సామాజిక వర్గం నుంచి 13 మంది పోటీ చేయగా....
కాంగ్రెస్‌ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ఐదుగురు గెలిపొందారు. 


లింగాయత్‌ సామాజిక వర్గం నుంచి 69 మంది పోటీ చేయగా....
కాంగ్రెస్‌ నుంచి 45 మంది, బీజేపీ నుంచి 20 మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు, గాలి జనార్థన్‌రెడ్డి పార్టీ KRPP నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌ గా ఒకరు గెలిచారు. 


మరాఠా సామాజిక వర్గం నుంచి ఆరుగురు పోటీ చేయగా....
కాంగ్రెస్‌ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరు గెలుపొందారు.


SC సామాజిక వర్గం నుంచి 37 మంది పోటీ చేయగా....
కాంగ్రెస్‌ నుంచి 22 మంది, బీజేపీ నుంచి 12 మంది, జేడీఎస్ నుంచి ముగ్గురు గెలిచారు.


ST సామాజిక వర్గం నుంచి 15 మంది పోటీ చేయగా....
కాంగ్రెస్‌ నుంచి 14 మంది, జేడీఎస్ నుంచి ఒక్కరు గెలుపొందారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy Analysis: భజరంగభళీనే బీజేపిని ఓడించాడు.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్


లింగాయత్‌ల తరువాత కర్ణాటకలో వొక్క లింగాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సామాజిక వర్గం నుంచి 51 మంది పోటీ చేయగా....
అత్యధికంగా కాంగ్రెస్‌ నుంచి 27 మంది, జేడీఎస్ నుంచి 12 మంది, బీజేపి నుంచి 10 మంది, SKP, ఇండిపెండెంట్‌ నుంచి ఒక్కొక్కరు గెలిచారు. 


ఇది కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థుల పార్టీలు, సామాజికవర్గాలు, ప్రాంతీయత వివరాలు. ఏదేమైనా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం రానున్న లోక్ సభ ఎన్నికలకు మాస్త్ బూస్టింగినిచ్చినట్టయింది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపి పోస్ట్ మార్టం చేసే పనిలో బిజీగా ఉంది.


ఇది కూడా చదవండి : JPS Strike Withdrawn: సమ్మె విరమించిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలు


ఇది కూడా చదవండి : Bandi Sanjay About Karnataka Results: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి ఓటమిపై బండి సంజయ్ విశ్లేషణ