Work from home: వర్క్ ఫ్రం హోం పాలసీపై ఐటి కంపెనీలకు Karnataka govt సూచనలు
Work from home in Bengaluru: సెప్టెంబర్ నెల నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని ఆఫీసులకు రావాల్సిందిగా సూచించనున్నట్టు తెలుస్తున్న క్రమంలో ఐటి ఉద్యోగుల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Work from home in Bengaluru: బెంగళూరు: వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీపై రోజుకొక రకమైన వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నెల నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని ఆఫీసులకు రావాల్సిందిగా సూచించనున్నట్టు తెలుస్తున్న క్రమంలో ఐటి ఉద్యోగుల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే, మరోవైపు లాక్‌డౌన్ సమయంలో, వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంలో బహిరంగ స్థలాల్లో చేసే అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఈ నేపథ్యంలోనే వర్క్ ఫ్రం హోం విధానంపై కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
వర్క్ ఫ్రం హోం గడువు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పెంచి అప్పటివరకు ఐటి ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధంగా కానీ లేదా ఆఫీసులకు వచ్చే సిబ్బంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించేలా చూడాల్సిందిగా కోరుతూ బెంగళూరులోని ఐటీ కంపెనీలను కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. ఇది కేవలం ఒక సూచన మాత్రమే కానీ ఆదేశం కాదు అని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ఈ.వి. రమణా రెడ్డి తెలిపారు. అందుకు కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ గడువు ముగిసి ఐటి సిబ్బంది తమ సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళ్లడం మొదలుపెడితే రోడ్లపై ఏర్పడే రద్దీ కారణంగా బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ కారిడార్‌లో జరుగుతున్న బెంగళూరు మెట్రో (Bengaluru metro Rail) పనులకు అంతరాయం ఏర్పడుతుందనే ఆలోచనేనట.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాప్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్‌కు (NASSCOM) లేఖ రాసిన కర్ణాటక సర్కారు.. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్‌పై ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్న చోట్ల జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆ లేఖలో వివరించింది. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు ట్రాఫిక్ రద్దీ లేకపోతే.. ఆ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు వీలు కలుగుతుందని కర్ణాటక సర్కారు (Karnataka) ఆ లేఖలో అభిప్రాయపడింది.
ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ మెట్రో లైన్ అభివృద్ధి పనుల వల్ల బస్సుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక రహదారి, ఇతర వాహనాలను మరో దారి ఏర్పాటు చేశారు. ఒకవేళ బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డు కారిడార్‌లో ఉన్న ఐటి కంపెనీలు ఆఫీసుల నుంచి పనిచేయడం మొదలుపెట్టినట్టయితే.. ట్రాఫిక్ రద్దీ పెరిగి అభివృద్ధి పనులు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని కర్ణాటక ప్రభుత్వం (Karnataka govt) భావిస్తోంది. అందులో ఇప్పటికే సిస్కా లాంటి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని (Work from home) పొడిగించి ఉండగా.. మిగతా కంపెనీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కంపెనీలు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వాటికే ఉందని కర్ణాటక సర్కారు స్పష్టంచేసింది.