గౌరీ లంకేష్ కేసులో హంతకులెవరో తెలుసు..!
ప్రముఖ పాత్రికేయురాలు గౌరి లంకేశ్ కేసులో హంతకులెవరో తెలిసిందని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని కర్ణాటక హోంశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి తెలిపారు. శనివారం బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "గౌరి లంకేష్‌ను హతమార్చిన వారి వివరాలు తెలిశాయి. కొన్ని రోజుల్లో వారిని చట్టం ముందు ప్రవేశపెడతాం. వారెవరో సీసీటీవీ ఫుటేజి ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రసుత్తం కర్ణాటకలో లా అండ్ ఆర్డరు పరిరక్షణ నిమిత్తం మేము అనుసరించాల్సిన పద్ధతులేమిటో మాకు తెలుసు.. సంఘ విద్రోహక శక్తులను గూండా చట్టం క్రింద అరెస్టు చేసి వారిని వీలైతే రాష్ట్రం నుండి బహిష్కరించాలని పోలీసు అధికారులకు తెలిపాం. ఈ విషయమై 30 అంశాల మీద ఒక ఛార్టు తయారు చేశాం.. వాటిపై పోలీసులు అవగాహన పొందాలని తెలియజేశాం. కాలేజీలతో పాటు పబ్లిక్ ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్ లాంటి నేరాలకు పాల్పడే ముఠాలపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. మహిళలకు భద్రత కల్పించడమే మా ప్రభుత్వం అభిమతం. ఈ విషయంలో మాకు ఎవరైనా ఒకటే. ఈ మధ్యకాలంలో ఆఫ్రికా, నైజీరియా ప్రాంతాల నుండి వస్తూ.. ఇక్కడ చదువుకుంటున్న కొందరు విద్యార్థులు కూడా అల్లర్లకు పాల్పడుతున్నారు. అటువంటి వారికి ఇక్కడ స్థానం లేదు. తగిన చర్యలు తీసుకొని వారిని వారి దేశానికి పంపించేస్తాం. వారు ఇక్కడ గంజాయి, హఫీమ్ లాంటి మాదకద్రవ్యాలు విద్యార్థులకు సరఫరా చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాలి. నేను సున్నిత మనస్కుడినే అయినప్పటికీ.. వీలైతే లా అండ్ ఆర్డర్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను" అని హోం మంత్రి తెలిపారు.