వరద బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ భారీ విరాళం
వరద బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ భారీ విరాళం
భారీ వర్షాలు, వరదలు.. కేరళ, కర్ణాటక సరిహద్దు కొడగు జిల్లాలో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే..! వరద బాధితులను ఆదుకొనేందుకు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించి సహాయం అందించారు. నగదు, సరుకులు ఇలా తమకు తోచింది సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
తాజాగా ఇన్ఫోసిస్ వరద బాధితులకు భారీ విరాళాల్ని ప్రకటించింది. కర్ణాటక కొడగు జిల్లా వరద బాధితుల సహాయార్థం టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్, టీటీడీ సభ్యురాలు సుధామూర్తి వరద బాధితులకు రూ.25 కోట్ల విరాళం ప్రకటించారు.
ఇటీవలే వరద బాధితులకు సుధామూర్తి ఉద్యోగులతో కలిసి నిత్యావసరాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె స్వయంగా సరుకులను ప్యాక్ చేయడంతో పాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు.
కాగా బుధవారం కర్ణాటకలోని మైసూర్ దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి, సీఎం హెచ్‌డీ కుమారస్వామి కలిసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలు 10 రోజులు జరుగుతాయి. నవరాత్రితో ఉత్సవాలు మొదలై చివరిరోజు విజయదశమితో ముగుస్తాయి.