కర్నాటక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాని విషయం తెలిసిందే.  సంపూర్ణ మెజార్టీ ఎవరకీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్  కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో.. అతిపెద్ద పార్టీగా అవతరించిన తామే అధికారం చేపడతామని బీజేపీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ను  కోరడం దీనికి గ్రీన్ సిగ్నల్ అందడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు బలపరీక్షకు సిద్ధమైంది బీజేపీ. ఇదే సమయంలో బలపరీక్షలో సత్తా చాటాలని కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహం సిద్ధం  చేసుకున్నాయి.  తాజా పరిణామాల నేఫథ్యంలో ఉత్కంఠత నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం 222 స్థానాలు ఉన్న కర్నాటక అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం 112.  కాంగ్రెస్ (78) జేడీఎస్ (38) ఇద్దరి బలం కలిపితే 116. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ బలం సరిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఈ  రెండు పార్టీలు ధీమాతో కనిపిస్తున్నప్పటికీ గోడదూకే ఎమ్మెల్యేల విషయంపై ఇరు పార్టీలు లోలోపల ఆందోళన చెందుతున్నాయి. ప్రధానంగా లింగాయత్ వర్గపు ఎమ్మెల్యేల విషయమై ఇరు పార్టీల నేతల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు  సాయంత్రం జరిగే బలపరీక్షలో ఈ వర్గపు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశమున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. 
 
వాస్తవానికి కాంగ్రెస్ లో 18 మంది లింగాయూత్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. లింగాయూత్ లకు వ్యతిరేకంగా భావిస్తున్న జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ జతకట్టడం వంటి పరిణామాలు ఆ వర్గపు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో  ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 


లింగ్ యూత్ వర్గం ఎమ్మెల్యేల అసంతృప్తిని తమకు అనుకూలంగా మరల్చుకోవాలని బీజేపీ భావిస్తుంది. అందుకే పూర్తి స్థాయిలో మెజార్టీ లేనప్పటికీ బలపరీక్షకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కాగా లింగాయూత్ వర్గపు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బలపరీక్షలో నెగ్గాలని బీజేపీ చూస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ కు చెందిన 18 మంది లింగాయత్ వర్గపు ఎమ్మెల్యేలపైనే అందరి దృష్టి ఉంది.