న్యూఢిల్లీ: జలేష్ క్రూయిజెస్ ఆపరేట్ చేస్తోన్న భారీ క్రూయిజ్ షిప్ కర్ణిక నిన్న సముద్రంలోకి ప్రవేశించడమేకాకుండా దిగ్విజయంగా తొలి సముద్ర యాత్రను పూర్తి చేసుకుంది. 14 అంతస్తుల కలిగిన ఈ భారీ నౌకలో ఒకేసారి 2,700 మంది ప్రయాణించగల సామర్ధ్యం సొంతం. 250 మీటర్ల పొడవైన ఈ భారీ నౌకలో 7 స్టార్ హోటల్లో ఉండే అన్ని హంగులు, సకల సౌకర్యాలు ఉన్నాయి. సముద్రదేవుడు అనే అర్థం కలిగిన జలేష్ క్రూయిజెస్.. దేశ, విదేశీ ప్రయాణికులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భారతీయ ప్రత్యేక వంటకాలను రుచిచూపించే విధంగా రూపొందించిన లగ్జరీ నౌక ఇది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం రాత్రి ముంబై వద్ద సముద్రంలో తన తొలి యాత్రకు శ్రీకారం చుట్టిన కర్ణిక నౌక.. రాత్రంతా ప్రయాణించి గురువారం అంటే నేటి ఉదయం గోవాలోని సముద్ర తీరానికి చేరింది. వేసవి సెలవుల్లో సరదాగా తిరిగొద్దామనుకునే వారికి ఈ నౌకాయానం ఒక అద్భుతమైన ఎంపిక అవుతుందని కర్ణిక క్రూయిజ్ నిర్వాహకులు తెలిపారు. కర్ణిక నౌకలో ప్రయాణించిన ప్రయాణికులు సైతం గోవా తీరంలో మీడియాతో మాట్లాడుతూ.. అద్భుతమైన, మరిచిపోలేని అనుభవాన్ని సొంతం చేసుకున్నట్టు ఆనందం వ్యక్తంచేశారు. 


ఇదే నౌకపై తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న అనిత మాలి తనకు ఈ పుట్టిన రోజు వేడుకలు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినిచ్చాయని, ఈ జ్ఞాపకాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. 


చక్కటి మ్యూజిక్, డ్యాన్స్ షోలు, ఇతర వినోదాత్మక కార్యక్రమాలెన్నో ఈ నౌకపై ప్రయాణికులను అలరించే విధంగా నౌకను తీర్చిదిద్దారు. కర్ణిక నౌకపై ప్రయాణం ఓ మరిచిపోలేని అనుభూతి అని చెబుతూ.. తాను తన స్నేహితులకు అందరికీ ఈ నౌకపై ప్రయాణించాల్సిందిగా సూచిస్తానని చెబుతున్నారు హిమాన్షు పటేల్ అనే ప్రయాణికుడు. అద్దిరిపోయే షాపింగ్, నచ్చిన వంటకాల్ని రుచిచూపించే రెస్టారెంట్స్ ఈ నౌకపై కొలువుతీరి వున్నాయి.