జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మహిళా కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 8 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారం, హత్యకేసులో తీర్పును సాధ్యమైనంత త్వరగా ప్రకటించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముఖ్యంగా ఈ కేసులో మరణించిన బాలిక తల్లిదండ్రులు సంచారజాతులకు చెందిన వారు కాబట్టి.. వారి జీవన స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకొని త్వరగా విచారణ చేసి తీర్పును కోర్టు వెల్లడించేలా చూడాలని కమీషన్ కోరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో కమీషన్ ఛైర్ పర్సన్ నయిమా అహ్మద్ మెహజూర్, నిందితులకు మరణ శిక్ష విధించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కేసు తీవ్రతను కూడా తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని.. అందుకే సాధ్యమైనంత త్వరగా ప్రధాన న్యాయమూర్తిని కూడా కలిసి మాట్లాడి.. బాధితులకు న్యాయం లభించేలా ప్రయత్నిస్తామని తెలిపారు


"మేము ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడాము. సోషల్ మీడియాలో కూడా ఈ కేసు గురించి సాధ్యమైనంత వరకూ ప్రచారం చేస్తున్నాము. ప్రజలు కూడా తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ పాపం చేసిన వారికి కఠినమైన శిక్ష పడాల్సిందే. ప్రజలందరూ కూడా నేరస్థులకు మరణశిక్షే సరైన శిక్ష అని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉంది" అని కమీషన్ ఛైర్మన్ మెహజూర్ తెలిపారు.


అందుకే ఈ కేసు వెనువెంటనే పరిష్కారం కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది వ్యక్తులపై చార్జిషీటు ఫైల్ అయ్యింది. అందులో ఓ రిటైర్డు రెవెన్యూ అధికారితో పాటు అతని కుమారుడు, మేనల్లుడు, ముగ్గురు పోలీసు అధికారులు, ఓ కానిస్టేబుల్ పై కూడా కేసులు నమోదు చేశారు.