ఆధార్ లాగే ఓటర్ కార్డుకూ విశిష్ట గుర్తింపు సంఖ్య
దేశవ్యాప్తంగా ఉన్న దొంగ ఓటరు కార్డులను అరికట్టేందుకు కేంద్రం ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న దొంగ ఓటరు కార్డులను అరికట్టేందుకు కేంద్రం ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఆధార్ సంఖ్య మాదిరే ఓటరు కార్డుకూ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలని యోచిస్తోంది. దేశంలో ఎక్కడికి మారినా అదే నెంబర్ వర్తించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. జనవరిలో దీనిని అందుబాటులోకి తీసుకురానున్న ఎన్నికల సంఘం.. అన్‌లైన్‌లో అన్ని రాష్ట్రాల ఓటరు జాబితాలను ఉంచనుంది. దీంతో నియోజకవర్గం పరిధిలోనే కాకుండా రాష్ట్రాల పరిధిలో దొంగ ఓట్లను అరికట్టవచ్చు.
ప్రస్తుతం ఓటరు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారితే చిరునామాతో పాటు ఓటరు కార్డు, దానిపై ఉండే సంఖ్య కూడా మారుతుంది. దీంతో అంతకుముందున్న ఓటు హక్కును రద్దు చేయకుండానే మరో ప్రాంతంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల దొంగ ఓట్లు పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆధార్ లాగే ఓటరు కార్డుకూ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఓటర్లకు పది లేదా పన్నెండు అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. ఈ విశిష్ట సంఖ్య ప్రక్రియను జనవరి1వ తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.