జింకలను వేటాడిన కేసులో జోథ్‌పూర్‌ కోర్టు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా నిర్థారించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 9, 51 సెక్షన్లను అనుసరించి ఆయనతో పాటు నటీనటులు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌‌లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఈ రోజు తీర్పును వెలువరిస్తూ.. సల్మాన్‌ను దోషిగా కోర్టు ప్రకటించింది. ఈ క్రమంలో ఆయనకు అయిదు సంవత్సరాలు జైలు శిక్షను ధర్మాసనం విధించింది. అలాగే రూ.10,000 జరిమానా కూడా కట్టమని తెలిపింది. అయితే మిగతా నటీనటులకు సంబంధించి తగిన ఆధారాలు లేనందున.. వారిని నిర్దోషులుగా కోర్టు పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, ప్రస్తుతం ఈ తీర్పు వల్ల సల్మాన్ సైన్ చేసిన సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ల గుండెలు గుభేలుమంటున్నాయి. రేస్‌ 3తో పాటు అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా, దబాంగ్ 3, కిక్ 2 సినిమాలకు ఇప్పటికే సల్మాన్ సైన్ చేశారు.


సాధారణంగా ఇలాంటి కేసుల్లో శిక్ష ఆరేళ్ల నుండి ఏడేళ్ళ వరకు ఖరారు అయ్యే అవకాశం ఉంది. అయితే సల్మాన్ ఖాన్‌ చేస్తున్న సామాజిక సేవను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఆఖరికి అనేక వాదోపవాదాల తర్వాత సల్మాన్‌ను దోషిగా నిర్థారించి.. ఆయనకు 5 సంవత్సరాలు శిక్షను విధించింది కోర్టు.