లైవ్ అప్‌డేట్స్: కరుణానిధికి కన్నీటి వీడ్కోలు.. మెరీనా బీచ్‌లో పూర్తయిన అంత్యక్రియలు
అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూసిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కడసారి చూసేందుకు ప్రముఖులు, ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం కరుణానిధి భౌతిక కాయాన్ని చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాళులర్పించారు. భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకుని తమ నాయకుడిని చివరిసారిగా దర్శించుకుని నివాళులర్పిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి.
కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ కరుణకు నివాళులు అర్పించడానికి చెన్నైకి రానుండగా.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్‌లు కళైంజర్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.
అటు తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్, సీఎం పళని స్వామిలతో పాటు.. తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరుణకి శ్రద్ధాంజలి ఘటించారు. డీఎంకే అధినేత, కలైంజ్ఞర్ కరుణానిధి అస్తమయం పట్ల కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. నేడు సంతాప దినంగా కేంద్రం ప్రకటించింది. కరుణానిధి మృతి చెందిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు తెలిపింది. బీహార్‌లో రెండు రోజులపాటు సంతాప దినాలు పాటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Latest Updates
సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలకగా, కుటుంబసభ్యుల సమక్షంలో మెరీనా బీచ్‌లో పూర్తయిన తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలు
మెరీనా బీచ్‌లోని అన్నా మెమొరియల్ పక్కనే కరుణానిధి సమాధికి ఏర్పాట్లు
ఇంకొద్దిసేపట్లో పూర్తికానున్న కరుణానిధి అంత్యక్రియలు.. తండ్రి పార్థివదేహానికి చివరిసారిగా నమస్కరిస్తున్న ఆయన తనయుడు ఎం.కే. స్టాలిన్, కూతుళ్లు కనిమొళి, సెల్వి
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల సందర్భంగా మెరీనా బీచ్‌లో ఆయన పార్థివదేహానికి ఘన నివాళి అర్పిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రి డి జయకుమార్, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్
మెరీనా బీచ్‌లో తన తండ్రి కరుణానిధి అంత్యక్రియల సందర్భంగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే. స్టాలిన్, సోదరి సెల్వి, సోదరుడు అళగిరి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అంత్యక్రియలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీఎంసీ నేత డిరెక్ ఓ బ్రియన్
తమిళ రాజకీయ దిగ్గజం కరుణానిధి పార్థివదేహాన్ని అంతిమ యాత్రగా తీసుకెళ్లడానికి ముందుగా రాజాజీ హాల్‌కి చేరుకుని నివాళి అర్పించిన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ నేత ప్రఫుల్ పటేల్
కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం.. కాసేపట్లో మెరీనా బీచ్‌కు
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పార్ధివదేహానికి నివాళి అర్పించిన ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ్ జనతా దళ్ (ఆర్జేడీ) నేత, బీహార్ రాష్ట్ర మాజీ మంత్రి తేజస్వి యాదవ్
మెరినా బీచ్‌లో కరుణానిధికి ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలకు జరుగుతున్న ఏర్పాట్లు
చెన్నైలోని రాజాజీ హాల్ వద్ద తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
డీఎంకే వర్గాలు, పార్టీ మద్దతుదారులు సంయమనం పాటించాలని కరుణానిధి తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే. స్టాలిన్ విజ్ఞప్తి. అధికారంలో ఉన్న వాళ్లు కుట్రలు పన్నుతున్నారని స్టాలిన్ వ్యాఖ్యలు.
తమకు అండగా నిలిచిన పార్టీ వర్గాలు శాంతియుత పద్ధతిలో సంయమనంతో వ్యవహరించాల్సిందిగా అభ్యర్థించిన ఎం.కే. స్టాలిన్
రాజాజీ హాల్ వద్ద కరుణానిధి పార్థివదేహాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వారిని నిలువరించేందుకు లాఠీ ఛార్జ్ చేస్తున్న పోలీసులు
రాజాజీ హాల్ ఏరియల్ వ్యూ: కరుణానిధి పార్థివదేహాన్ని కడసారి చూసి కన్నీటి వీడ్కోలు పలికేందుకు రాజాజీ హాల్ వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్న అభిమానులు
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నివాళి అర్పించేందుకు చెన్నై చేరుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
ఇవాళ సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెన్నై బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లి కరుణ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజయవాడ నుండి చెన్నైకి చేరుకొని కరుణానిధికి నివాళులు అర్పించనున్నారు.
డీఎంకే మద్దతుదారులు చెన్నై మెరీనా బీచ్ వద్ద గల అన్నా మెమోరియల్ వెలుపల గుమిగూడి ఉన్నారు. అన్నా మెమోరియల్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించడానికి మద్రాసు హైకోర్టు అనుమతి మంజూరు చేసిన క్రమంలో మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు.
డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహానికి రాజాజీ హాలులో ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. అనంతరం ఎంకే స్టాలిన్, కనిమొళితో కాసేపు మాట్లాడారు.
దివంగత డీఎంకే అధినేత, కలైంజ్ఞర్ కరుణానిధి అంతక్రియలను మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్‌లో నిర్వహించడానికి మద్రాస్ హైకోర్టు అనుమతినివ్వడంతో డీఎంకే మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
కరుణానిధి పార్థివదేహం వద్ద రోదిస్తున్న కుమారులు అళగిరి, స్టాలిన్, కుమార్తె కనిమొళి
మెరీనా బీచ్‌లోని దివంగత అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి భౌతిక కాయానికి అంత్యక్రియలు: మద్రాస్ హైకోర్టు
దివంగత డీఎంకే అధినేత కరుణానిధి అంతక్రియలను మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్‌లో నిర్వహించనున్నారు. అన్నా మెమోరియల్‌లో అంత్యక్రియలు నిర్వహించడానికి మద్రాసు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. తమిళనాడు ప్రభుత్వం కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోవడంతో డీఎంకే నేతలు హైకోర్టును ఆశ్రయించారు. రాత్రి సమయంలో ఈ కేసు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనిపై నేటి ఉదయం నుంచి తిరిగి విచారణ జరిపారు. మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్‌లో అంత్యక్రియలు జరపడానికి అనుమతి మంజూరు చేశారు.
దివంగత డిఎంకె అధినేత కరుణానిధికి ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ నివాళులర్పించారు.రాజాజీ హాల్ భార్య లతా, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌లతో కలిసి వచ్చిన రజనీకాంత్ కరుణానిధి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
డీఎంకే కురువృద్ధుడు కరుణానిధికి నివాళులు అర్పించేందుకు చెన్నై చేరుకున్న ప్రధాని. మరికాసేపట్లో కరుణానిధి భౌతికకాయానికి మోదీ నివాళులర్పించనున్నారు. చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానిని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్వీర్ సెల్వంలు రిసీవ్ చేసుకున్నారు.
రాజాజీ హాల్‌లో ఉన్న కరుణానిధి పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.
అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహానికి రాజాజీ హాలులో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించారు.
తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి సేవలకు గుర్తింపుగా.. కేంద్రం వెంటనే ఆయనకు భారతరత్న ఇవ్వాలని విద్యుతలై చిరుతైక్కల్ కత్చి పార్టీ అధినేత తొలి తిరుమలవర్ డిమాండ్ చేశారు.
మెరీనా బీచ్‌లోని దివంగత అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించాలన్న డీఎంకే డిమాండ్.. కోర్టులో కొనసాగుతున్న వాదనతో అన్నా మెమోరియల్ వద్ద తమిళనాడు సర్కార్ భారీగా పోలీసులను మోహరించింది.
మెరీనా బీచ్‌లోని దివంగత అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించాలన్న అంశంపై ఇప్పటికే వాదనలు పూర్తి అవగా.. కాసేపట్లో మద్రాస్ హైకోర్టు తీరును వెల్లడించే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెమోరియల్ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించింది.
నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ చెన్నైలోని రాజాజీ హాల్ వద్ద మాజీ సీఎం ఎం కరుణానిధికి నివాళులు అర్పించారు.